Kaushik Reddy | హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట దక్కింది. క్వారీ యజమానిని బెదిరించారనే కేసులో కోర్టు కీలక తీర్పును వెలువరించింది. కౌశిక్‌రెడ్డి రిమాండ్‌ను ఖాజీపేట రైల్వేకోర్టు తిరస్కరించడంతో పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. క్వారీ యజమానిని బెదిరించారన్న కేసులో పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకొని వరంగల్‌కు తరలించారు.
మనోజ్‌రెడ్డి అనే వ్యాపారిని రూ.50లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడని అతని భార్య సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు. ఈ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు కౌశిక్‌రెడ్డి అరెస్టు చేశారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం కాజీపేట రైల్వే కోర్టులో హాజరుపరిచారు. 41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు రిమాండ్‌ను ఖాజీపేట రైల్వేకోర్టు న్యాయమూర్తి తిరస్కరించి.. బెయిల్‌ను మంజూరు చేశారు.