హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): కారు గుర్తు మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెచిలి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ తనది ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీయేనని స్పీకర్‌కు వివరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. చెయ్యి గుర్తు మీద తాను సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీచేసిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని కోరినట్టు సమాచారం. దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ శుక్రవారం అసెంబ్లీలోని తన చాంబర్లో విచారించారు. ఈ విచారణకు నాగేందర్, కౌశిక్‌రెడ్డి తమ న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు. వీరి వాదనలు విన్న తర్వాత స్పీకర్ సాక్ష్యాలను నమోదు చేయనున్నారు. కాగా బీజేపీ శాసనపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఈ విచారణకు హాజరుకాలేదు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున విచారణ వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరారు. దీంతో స్పీకర్ ఫిబ్రవరి 18కి విచారణను వాయిదా వేశారు.
నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే
తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, ఇప్పటికీ ఆ పార్టీ సభ్యుడినేనని దానం నాగేందర్ తన న్యాయవాదుల ద్వారా స్పీకర్‌కు వివరించినట్టు తెలిసింది. 2024 మార్చిలో తాను కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరైన మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే.. వ్యక్తిగత హోదాలో మాత్రమే తాను సమావేశానికి వెళ్లానని, దానిని పార్టీ మార్పిడిగా పరిగణించవద్దు అని కోరినట్టు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ కూడా తనను సస్పెండ్ చేయలేదని గుర్తుచేస్తూ.. కేవలం మీడియా కథనాల ఆధారంగా తనపై అనర్హత వేటు వేయవద్దని కోరినట్టు తెలిసింది. ఇవే వివరాలతో కూడిన అఫిడవిట్‌ను ఆయన ఈ నెల 25న స్పీకర్‌కు సమర్పించారు. తాజాగా అవే విషయాలను స్పీకర్‌కు వివరించినట్టు సమాచారం.
స్పీకర్ నిర్ణయంపై ఆసక్తి
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల మీద నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే స్పీకర్‌కు కోర్టు ధికరణ నోటీసులు జారీచేస్తూ.. త్వరగా నిర్ణయం తీసుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలలో ఏడుగురికి క్లీన్ చిట్ ఇచ్చారు. వారు పార్టీ మారినట్టు సరైన ఆధారాలు లేవని పేరొంటూ వారిపై పిటిషన్లను కొట్టేశారు. అయితే దానం నాగేందర్ కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేసిన రికార్డులు ఉండటంతో.. ఆయన విషయంలో స్పీకర్ ఎలాంటి తీర్పునిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.