Danam Nagender | అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ జారీ చేసిన నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఈ మేరకు స్పీకర్‌కు లేఖ రాశారు. వివరణకు ఇచ్చేందుకు తనకు మరికొంత సమయం కావాలని ఆయన లేఖలో కోరారు. స్పీకర్ ఇచ్చిన గడువు ముగియడంతో ఆదివారం మరోసారి లేఖ రాశారు. ఇప్పటికే స్పీకర్ రెండుసార్లు దానంకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి, పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది విచారణ ముగిసింది. రెండోసారి దానం నాగేందర్‌కు స్పీకర్ నోటీసులు జారీ చేసిన ఆయన స్పందించలేదు. నోటీసుల గడువు ఆదివారంతో ముగియనున్నది. ఈ క్రమంలో దానం మరోసారి స్పీకర్‌కు లేఖ రాశారు. అంతకు ముందు శాసన వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబుతో సమావేశమయ్యారు.
అంతకుముందు రెండు రోజులు ఢిల్లీలో అధిష్ఠానం పెద్దలను కలిసి వచ్చి.. ఆ తర్వాత శ్రీధర్‌బాబుతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఖైరాతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆయన.. సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడంతో ఆయనపై అనర్హత వేటు ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాజీనామాకు సిద్ధమయ్యారంటూ వార్తలు వచ్చాయి. సోమవారం రోజున రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా మరోసారి ఆయన స్పీకర్‌ను గడువు కోరడం చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ గడువు ఇస్తారా? లేదా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇటీవల సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపులపై నిర్ణయాన్ని నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్పీకర్ దానం నాగేందర్‌కు సమయం ఇస్తారా ఇవ్వరా? అన్నది ఆసక్తికరంగా మారింది.