హైదరాబాద్: నవరాత్రులు విశేషమైన పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు (Khairatabad Ganesh) గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. భారీ జనసందోహం మధ్య ట్యాంక్‌బండ్‌వైపు కదులుతున్నాడు. ఉదయం 4 గంటలకై మహా గణపతి టస్కర్ వాహనంపైకి చేరాడు. ఉదయం 7 గంటలకు కమిటీ సభ్యులు పూజలు ముగించారు. హారతి ఇచ్చి శోభాయాత్ర ప్రారంభించారు. రెండున్నర కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగనుంది. టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా సప్తముఖ మహాగణపతి ట్యాంక్‌బండ్ చేరుకుంటాడు. ఉదయం 10 గంటల వరకు ట్యాంక్‌బండ్ క్రేన్ నంబర్ 4 వద్దకు చేరుకునే అవకాశం ఉన్నది. మధ్యాహ్నం ఒకటి, రెండు గంటల లోపు నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మహా గణపతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
కాగా, భాగ్యనగరమే కాదు దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ గణేషుడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ఉత్సవాలను ప్రారంభించి 70 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి రికార్డు స్థాయిలో 70 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రతిష్టించారు. శిల్పి చిన్న స్వామి రాజేందర్ ఆధ్వర్యంలో లంబోధరుడుని రూపొందించారు. 200 మంది కార్మికులు ఒకటిన్నర రోజులు శ్రమించి గణేషుడిని అలంకరించారు. 11 రోజులపాటు మహాగణపతిని లక్షలాది మంది భక్తులు, సందర్శకులు దర్శించుకున్నారు. ఈసారి రూ.కోటి 10 లక్షల ఆదాయం సమకూరిందని నిర్వాహకులు వెల్లడించారు. హుండీ ద్వారా రూ.70 లక్షలు రాగా, ప్రకటనలు, హోర్డింగుల ద్వారా మరో రూ.40 లక్షలు సమకూరాయి.