
సంస్థాన్ నారాయణపురం, డిసెంబర్ 31: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామ చేనేత కళాకారుడు తాటి శేఖర్ బెస్ట్ ఖాదీ డిజైనింగ్ అవార్డు అందుకున్నారు. నేషనల్ ఖాదీ డిజైనింగ్ కౌన్సిల్-2021 అవార్డులను ప్రకటించగా గురువారం ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులు రాజేంద్ర అగర్వాల్, సంఘమిత్ర మౌర్య చేతుల మీదుగా శేఖర్ ఈ అవార్డును స్వీకరించారు. సంప్రదాయ పద్ధతుల్లో తయారు చేసిన ఖాదీ గార్మెంట్స్కు గాను ఈ అవార్డు దక్కింది. అవార్డు దక్కడం పట్ల శేఖర్తోపాటు గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. పుట్టపాక చేనేత కళాకారులు తయారు చేసిన తేలియా రుమాలుతోపాటు డబుల్ ఇక్కత్ డాబిబోన్ చీరె, డబుల్ ఇక్కత్ డాబిబోన్ దుప్పటి, పలు వస్ర్తాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటివరకు పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యానికి రెండు పద్మశ్రీ అవార్డులతోపాటు పలు జాతీయ అవార్డులు వచ్చాయి.