నగరంలో వరుస తుపాకుల కాల్పుల ఘటనలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. యథేచ్ఛగా పాత నేరస్తులు ఆయుధాలను పట్టుకొని తిరుగుతున్నా.. పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. ముఖ్యంగా ‘దేశీ గన్’ కల్చర్ హడలెత్తిస్తున్నది. ఇక్కడ ఆ గన్లకు గిరాకీ ఉండడంతో బీహార్, యూపీ రాష్ర్టాలకు చెందిన వారు సిటీలో ఆయుధాలను విక్రయిస్తున్నారు. ట్రై కమిషనరేట్లలో ఆక్రమ ఆయుధాల క్రయ విక్రయాలు సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మల్కాజిగిరిలో భార్యను భర్త తుపాకీతో కాల్చి చంపిన దారుణ ఘటన.. పోలీసుల నిఘా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. పాత నేరస్తులపై నిఘా కొరవడిందనే దానికి ఈ ఘటన సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది.
-సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తేతెలంగాణ)
హైదరాబాద్‌లో యథేచ్ఛగా తుపాకుల విక్రయాలు సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో తరచూ జరుగుతున్న తుపాకీ కాల్పుల ఘటనలు కలకలం రేపుతూనే ఉన్నాయి. తాజాగా మల్కాజిగిరిలో భార్యను భర్త తుపాకీతో కాల్చి చంపిన దారుణ ఘటన.. పోలీసుల నిఘా వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నది. జైలు నుంచి బయటకు వచ్చిన పాత నేరస్తులు మళ్లీ తుపాకీతో పట్టుకొని తిరుగుతున్నా..పోలీసులు గుర్తించలేకపోవడం పోలీసుల నిఘా వైఫల్యం స్పష్టమవుతున్నదని నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో భార్యను దారుణంగా కాల్చి చంపిన ఆమె భర్త అరుణ్ కొత్తగా నేర ప్రపంచంలోకి వచ్చినవాడు కాదు.
గతంలోనే ఇతను అంబర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తుపాకీతో తిరుగుతూ అరెస్టయ్యాడు. అప్పట్లోనే నా భార్యను చంపేందుకే తుపాకీ తెచ్చా..అన్ని అంబర్పేట్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. జైలు నుంచి బయటకు వచ్చిన నిందితుడు బయటకు వచ్చిన తరువాత అతని కదలికపై నిఘా పెట్టాల్సిన పోలీసులు ఆ విషయాన్ని విస్మరించారు. కఠిన నేరాలకు పాల్పడి, ఆయుధాలతో పట్టుబడిన నేరస్తులు జైలు నుంచి విడుదలయ్యాక ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉంటున్నారు? అనే రికార్డులను స్థానిక పోలీసులు అప్డేట్ చేసుకోవాలి. కానీ నిందితుడు అరుణ్ తమ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంటున్నాడన్న.. కనీస సమాచారం కూడా మల్కాజిగిరి పోలీసులకు లేదని తెలిసింది. ఒక వేళ పోలీసుల నిఘా ఉండి ఉంటే.. నిందితుడు మరోసారి తుపాకీ సేకరించడానికి అడ్డుకునే అవకాశం ఉండేది. పోలీసుల నిఘా లోపంతోనే ఒక నిండు ప్రాణం బలైందని సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు.
నగరంలోని దేశీ తుపాకులు యథేచ్ఛగా వస్తున్నాయి. ఇక్కడ ఆ తుపాకులకు గిరాకీ ఉండడంతో బీహార్, యూపీ రాష్ర్టాలకు చెందిన వారు నగరంలో ఆయుధాలను విక్రయిస్తూ పట్టుబడ్డ ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. తుపాకులు దొరకగానే అక్కడితోనే కేసును మూసేస్తూ, తరువాత ఆ కేసులో లోతైన దర్యాప్తును పోలీసులు మరిచిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ పోలీసులు తరచూ తుపాకులతో తిరుగుతున్న వ్యక్తులను పట్టుకున్నామంటూ..పట్టుబడ్డ వ్యక్తులను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు అప్పగిస్తూ కేసులు నమోదు చేస్తూ, నిందితులను జైలుకు పంపిస్తున్నారు.
ఇంత వరకు బాగానే ఉన్న తరువాత ఆ కేసులను పక్కన పెట్టేస్తున్నారు. అంబర్‌పేట్‌లో అక్రమ ఆయుధం కలిగి ఉన్నాడనే ఆరోపణలతో అరుణ్‌తో పాటు ఆ తుపాకీని విక్రయించిన మల్కాజిగిరి చెందిన మహ్మద్ అబ్బు, యాకుత్‌పురాకు చెందిన మీర్ ముజిమ్మిల్ను పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేశారు. ఇందులో ముజిమిల్ బీహార్ రాష్ట్రంలోని ముంగేర్ నుంచి దేశీయ తుపాకీ, కార్ట్రిడ్జ్లు కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో తెలిపారు.
ఈ తుపాకీని అరుణ్‌కు విక్రయించామని విచారణలో వెల్లడించారు. దీంతో పాటు ఈ విచారణలో తన భార్య నిషితారాణిని హత్య చేయాలని కుట్రలో ఉన్నట్లు అరుణ్ పోలీసులకు వివరించాడు. నిందితుడు జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత అతడు ఏం చేస్తున్నాడు..గతంలో అరస్టైయిన కారణం ఏంటీ.. అనే విషయాలను కుటుంబ సభ్యులకు తెలిపి, జాగ్రత్తలను కూడా పోలీసులు చెప్పాల్సి ఉన్నా ఆ విషయాన్ని పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. తాము ఫలాన వ్యక్తిని అరెస్ట్ చేశాం.. మీ ప్రాంతంలో ఉంటున్నాడనే సమాచారం, సమన్వయం కూడా పోలీస్ కమిషనరేట్ల మధ్య లేకపోవడం గమనార్హం.