హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠాలోని కీలక సూత్రధారి షేక్ బాషా సుల్తాన్ పోలీసులకు పట్టుబడ్డాడు. సీఎస్బీ చేపట్టిన ఈ మెగా ఆపరేషన్‌లో భాగంగా ఏపీలోని చిలకలూరిపేటలో ఈ నెల 19న ఆయనను అరెస్టు చేసినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) డీజీ శిఖాగోయెల్ శుక్రవారం ప్రకటించారు. నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ ఫిర్యాదు ఆధారంగా ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించినట్టు వెల్లడించారు. గత 25 రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆపరేషన్ నిర్వహించి 81 మంది నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. కాగా, దేశవ్యాప్తంగా 26 సైబర్ క్రైమ్ కేసులు, తెలంగాణలో నమోదైన 3 కేసులతో బాషా సుల్తాన్‌కు సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.