హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): హిడ్మా దారుణ ఎన్కౌంటర్ (Hidma Encounter) తర్వాత మావోయిస్టు (Maoists) కీలక నేతలు లొంగుబాట పట్టారు. మరో రెండురోజుల్లో పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు రాజిరెడ్డి, ఆజాద్ సిద్ధంగా ఉన్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. వీరిద్దరితోపాటు మరో రాష్ట్ర కమిటీ సభ్యుడు దామోదర్ కూడా లొంగిపోవాలని తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అయితే, అతడు లొంగిపోయేందుకు సిద్ధంగా లేడని తెలిసింది. హిడ్మాను నమ్మించి ఎన్కౌంటర్ చేసినట్టే తమను కూడా ఎన్కౌంటర్ చేస్తారేమోనని దామోదర్, ఇతర రాష్ట్ర కమిటీ సభ్యులు సందేహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. కాగా, ఇటీవల మావోయిస్టు పార్టీకి జనరల్ సెక్రటరీగా ఎన్నికైన తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీని లొంగుబాటుకు ఒప్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైనట్టు తెలిసింది. ఈ చర్చల జాప్యం వల్ల.. దేవ్జీకి ఏదైనా ప్రమాదం తలపెడితే.. ఆ నేరం ముమ్మాటికీ తెలింగాణ ప్రభుత్వానిదే అవుతుందని పౌర హక్కుల సంఘాలు అంటున్నాయి.
హిడ్మా ఎన్కౌంటర్కు ముందే తెలంగాణ పోలీసుల అదుపులోకి మావోయిస్టు రాష్ట్ర నా యకులు ఆజాద్, నారాయణ, వారితోపాటు క్యాడర్ వచ్చారు. ఎవరైనా సీసీ మెంబర్ స్థాయి వాళ్లను లొంగుబాటుకు ఒప్పించి.. వారితో పాటు వీరిని కూడా మీడియా ముందు చూపించాలని ప్రభుత్వ పెద్దలు వీరి లొంగుబాటును ఆపినట్టు తెలిసింది. ఇప్పటికే తమకు టచ్లోకి వచ్చిన వారికి హైదరాబాద్ నగరంలోనే షెల్టర్ ఇప్పించారని సమాచారం. ఈ క్రమంలో సీసీ మెంబర్ రాజిరెడ్డి లొంగిపోయేందుకు వస్తుండటంతో.. దేవ్జీ, దామోదర్ కోసం ప్రయత్నాలు చేశారని తెలిసింది. వారు లొంగుబాటుకు సుముఖంగా లేరని తేలడంతో రాజిరెడ్డి, ఆజాద్, నారాయణ లొంగుబాటును ఒక సభగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మావోయిస్టుల లొంగుబాటు సభను ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించాలని మొదట అనుకున్నారని తెలిసింది. అడవుల్లో కంటే.. హైదరాబాద్ నగరంలోనే వారి లొంగుబాటును చూపించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించడంతో ఇక్కడే ఆ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఈ సభకు సీఎం రేవంత్రెడ్డి హాజరై.. ఆయుధాలతో లొంగిపోయిన వారికి రాజ్యాంగ ప్రతి ఇస్తారని తెలిసింది. వారిపై ఉన్న రివార్డును స్వయంగా బహూకరిస్తారని సమాచారం. ఈ లొంగుబాటు కార్యక్రమాలన్నీ ఈ నెల 28లోపే జరిగిపోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 28 నుంచి ఛత్తీస్గఢ్లో అలిండియా డీజీపీల మీటింగ్ ఉంటడం, ఆ సమావేశానికి ప్రధాని, అమిత్షా హాజరవుతుండటంతో ఈ లొంగుబాటు ప్రక్రియను వేగవంతం చేశారు.