హైదరాబాద్, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ): సీఎంఆర్ ధాన్యానికి బ్యాంక్ గ్యారంటీ లింకు పెడుతూ పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. బ్యాంక్ గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చేసిన మిల్లర్లకే ధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్ల పాలసీని మంగళవారం విడుదల చేసింది. ఈ పాలసీలో ధాన్యం కొనుగోళ్లు, మిల్లులకు ధాన్యం కేటాయింపు, సీఎంఆర్‌పై సంచలన నిర్ణయాలను వెల్లడించింది. డిఫాల్ట్ మిల్లర్స్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ ధాన్యం కేటాయించేది లేదని తేల్చి చెప్పింది. మిగిలిన మిల్లర్లను మూడు క్యాటగిరిలుగా విభజించి వారు సీఎంఆర్ ఇచ్చిన విధానాన్ని బట్టి గ్యారంటీలను నిర్ణయించింది. వాస్తవానికి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కావడానికి ముందే ఈ పాలసీని విడుదల చేయాలి. కానీ ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించిన 20 రోజుల తర్వాత పాలసీని విడుదల చేయడం గమనార్హం. ‘కనీసం ఇప్పటికైనా పాలసీని విడుదల చేశారు. అధికారుల తీరు చూస్తే ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాక పాలసీ ఇస్తారేమో అనుకున్నాం’ అంటూ ఓ మిల్లర్ ఎద్దేవా చేయడం గమనార్హం.
బ్యాంకు గ్యారెంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్
సీఎంఆర్‌లో ఎలాంటి జాప్యం లేకుండా బియ్యం ఇచ్చిన మిల్లర్లకు వారి మిల్లింగ్ కెపాసిటీలో మద్దతు ధర ఆధారంగా 10శాతం బ్యాంక్ గ్యారంటీ లేదా 25శాతం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. గతంలో సీఎంఆర్ పెండింగ్‌లో ఉండి పెనాల్టీతో క్లియర్ చేసిన మిల్లర్లు 20 శాతం బ్యాంక్ గ్యారంటీ లేదా 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలి. పెండింగ్ సీఎంఆర్ క్లియర్ చేసి 25శాతం పెనాల్టీ పూర్తి చేయని మిల్లర్లు పెండింగ్‌లో ఉన్న పెనాల్టీ ధాన్యానికి 25శాతం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. అదే విధంగా మిల్లింగ్ కెపాసిటీలో 25 శాతం అధనంగా మరో బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది.
గడువులోగా సీఎంఆర్ ఇస్తేనే చార్జీల పెంపు
మిల్లింగ్ చార్జీలు పెంచాలని మిల్లర్లు డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం సన్న, దొడ్డు రకాల బియ్యానికి క్వింటాలుకు రూ.10 ఉండగా, దీన్ని దొడ్డురకానికి రూ.30, సన్న రకానికి రూ.40కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. మిల్లర్లు మాత్రం క్వింటాలుకు రూ.150 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాత్రం మిల్లర్ల డిమాండ్‌కు తగ్గట్టుగా మిల్లింగ్ చార్జీలను పెంచకపోగా పెంచిన ఆ చార్జీల అమల్లోనూ మెలిక పెట్టింది. ఎఫ్‌సీఐ ఇచ్చిన గడువులోగా ఇచ్చిన సీఎంఆర్‌కు మాత్రమే పెంచిన మిల్లింగ్ చార్జీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
సన్నధాన్యం పంచాయితీ తేల్చేది ఏఈవోలే
సన్నధాన్యం గుర్తింపు, కొనుగోలులో ఎదురయ్యే సమస్యల పరిష్కార బాధ్యతలను ఏఈవోలకు అప్పగించింది. సన్న ధాన్యంపై ఏమైనా అభ్యంతరాలుంటే సదరు మిల్లర్లు ఆన్లైన్ ద్వారా 48 గంటల్లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నది. ఆ తర్వాత 24 గంటల్లో ఏఈవోలు వారి సమస్యను పరిష్కరిస్తారని సూచించింది. సన్న ధాన్యంలో ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రతి మిల్లుకు ఒక ఏఈవోను కేటాయించింది. ఒకవేళ ఏఈవో నిర్ణయంపై మిల్లర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తే జిల్లా స్థాయిలో రెండు కమిటీలను ఏర్పాటు చేసింది.
గోదాముల్లోని ధాన్యానికి డీఎంలదే బాధ్యత…
రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యాన్ని మిల్లులతో పాటు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లోనూ నిల్వ చేయాలని నిర్ణయించింది. గోదాముల్లో నిల్వ చేసిన ధాన్యం పర్యవేక్షణ బాధ్యతను జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్(డీఎం)కు అప్పగించింది. ఒకవేళ గోదాముల్లో నిల్వ చేసిన ధాన్యం పాడైనా, కోత(షార్టేజ్) ఏర్పడినా, నాణ్యత దెబ్బతిన్నా అందుకు పూర్తి బాధ్యత డీఎందేనని స్పష్టం చేసింది.
బ్యాంకు గ్యారంటీ ఇవ్వలేం.. ధాన్యం దించుకోం
సీఎంఆర్, ధాన్యం కొనుగోళ్ల పాలసీలో ప్రభుత్వం పెట్టిన నిబంధనలపై రైస్ మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్షంగా రూపొందించిన పాలసీలో భాగస్వామ్యం కాలేమని స్పష్టంచేస్తున్నారు. ఈ పాలసీని, నిబంధనలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నిబంధనల ప్రకారం సన్న ధాన్యం ప్రొక్యూర్మెంట్ పాలసీలో, సీఎంఆర్‌లో భాగస్వామ్యం కాలేమని అసోసియేషన్ అధ్యక్షుడు గణపతిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. కొత్త పాలసీతో రా రైస్ మిల్లిం గ్ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్యలు పరిష్కరిస్తేనే పాలసీలో భాగస్వామ్యం