Friends of Publishing Award | కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు ప్రతిష్టాత్మకమైన ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు లభించింది. పుస్తక ప్రచురణ రంగంలో విశేషంగా కృషి చేసిన వారికి భారత ప్రచురణకర్తల సమాఖ్య ప్రతియేటా ఈ పురస్కారం ప్రదానం చేస్తుంది. డాక్టర్ కే శ్రీనివాసరావు ప్రచురణ పరిశ్రమకు చేసిన సేవలకు న్యూఢిల్లీలో ప్రచురణకర్తల సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ప్రచురణ మిత్ర పురస్కారాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, కేంద్ర మాజీమంత్రి స్మృతి ఇరానీ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భారత ప్రచురణ సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు నవీన్ గుప్తా ప్రణవ్ గుప్తా, జాతీయ అంతర్జాతీయ స్థాయి పుస్తక ప్రచురణ కర్తలు పాల్గొన్నారు.
సాహిత్య అకాడమీ ప్రచురిస్తున్న సంస్కృత పత్రిక ‘సంస్కృత్ ప్రతిభ’ కు ప్రధమ బహుమతి, అకాడమీ హిందీ పత్రిక ‘సమకాలీన భారతీయ సాహిత్య’ కు ద్వితీయ బహుమతి లభించాయి. బాలసాహిత్య విభాగంలో కూడా సాహిత్య అకాడమీకి ద్వితీయ బహుమతి లభించింది. ప్రభుత్వ రంగంలో దేశంలోనే అతిపెద్ద పుస్తక ప్రచురణ సంస్థగా పేరు గాంచిన కేంద్ర సాహిత్య అకాడమీ 24 భాషల్లో ఏటా 500కి పైగా పుస్తకాలు ప్రచురిస్తోంది.