KCR | వరంగల్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘కేసీఆర్ పనైపోయింది… ఇక ఆయన ఫాంహౌజ్‌కే పరిమితం… క్రీయాశీల రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం.. వయసు రీత్యా, ఆరోగ్య సమస్యల రీత్యా ఆయన ఇక ప్రజాక్షేత్రంలోకి రారు..’ అని రెండేండ్లుగా అధికార పక్షం ఉద్దేశపూర్వకంగా కొనసాగించిన అబద్ధాల ప్రచారాన్ని ఒకేఒక్క సమావేశంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పటాపంచలు చేశారు. ఆదివారం తెలంగాణభవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశం ఇన్నాళ్లు చెలరేగిపోయిన గొంతులను చీల్చిచెండాడింది. సమావేశం ప్రారంభం నుంచి కేసీఆర్ గంటన్నరపాటు నిలబడి ప్రసంగించారు. తరువాత కూర్చొని మరో గంటన్నరపాటు ఏకధాటిగా కాగితం ముక్కలేకుండా ధారపాతమై ప్రవహించారు. ఆ తరువాత మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. అదో గంటంబావు. మొత్తంగా నాలుగు గంటలకుపైగా కేసీఆర్ పార్టీ శ్రేణులతో ముచ్చటించారు.
తెలంగాణభవన్ కేంద్రంగా చోటుచేసుకున్న ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తీవ్ర ఉక్కపోతకు గురిచేసింది. ఆయన మంత్రివర్గాన్ని ఖిన్నులను చేసింది. మొత్తంగా అధికార పక్షానికి నిద్రపట్టని వాతావరణాన్ని కేసీఆర్ సృష్టించారు. మరోవైపు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఆ సమావేశం వేయి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. బీఆర్ఎస్ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తేదీ ఖరారైనప్పటి నుంచి రాజకీయాలు తీవ్రమైన ఉత్కంఠ రేపాయి. ‘చాలా రోజుల తరువాత కేసీఆర్ బయటికి (తెలంగాణభవన్‌కు) వస్తున్నారు. ఆయన ఏం మాట్లాడతారు? వివిధ పరిణామాలపై ఎలా స్పందిస్తారు? పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి? పార్టీ శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు?’ తదితర అనేక ప్రశ్నలకు కేసీఆర్ ఒకే ఒక సమావేశంతో జవాబు ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆయన టీం ఇంతకాలం చేసిన క్షుద్ర ప్రచారాన్ని తునాతునకలు చేశారు. నోరు జారితే ఇకనుంచి ‘తోలు తీస్తా’ అని హెచ్చరించారు.
గులాబీ శ్రేణుల్లో నయా జోష్
సుదీర్ఘ విరామం తరువాత గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం తొణకిసలాడింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీకి నైతికబలాన్ని అందిస్తే, పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై కేసీఆర్ తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. ఎర్రవెల్లి నివాసం నుంచి శనివారం కేసీఆర్ నందినగర్ చేరుకోవడం, అక్కడి నుంచి ఆదివారం తెలంగాణభవన్‌లో నాలుగు గంటలపాటు గులాబీ శ్రేణులకు రోడ్‌మ్యాప్ ఇవ్వడమే కాకుండా, తెలంగాణ ప్రజల్లో గూడుకట్టుకున్న అనునుమానపు ముసుర్లను కేసీఆర్ దూరం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఎన్నటికైనా తెలంగాణకు తామే అసలు సిసలు భూమిపుత్రులమని బీఆర్ఎస్ శ్రేణులు సగర్వంగా సమరనినాదం చేసేలా కేసీఆర్ కర్తవ్యబోధ చేశారని బీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.
మరో ఉద్యమానికి తాము వారధులం అవుతున్నామని గులాబీ శ్రేణులు సమరోత్సాహం ప్రదర్శిస్తున్నాయి. కేసీఆర్ కనబడితే కదనభేరి, మాట్లాడితే మరఫిరంగి అన్నట్టుగా తయారైన స్థితికి తెలంగాణభవన్‌కు వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలే నిదర్శనం. ప్రజాక్షేత్రంలో బరిగీసి నిలబడతామని కేసీఆర్ అల్టిమేటమ్ ఇవ్వడంతో కాంగ్రెస్ సర్కార్‌కు ‘ఇక ముందున్నది ముసళ్ల పండుగే’నని భావిస్తున్నారు. ఉద్యమకాలంలోనే కాదు ఇప్పుడు కూడా కేసీఆర్ మాట్లాడితే సంచలనమని మరోసారి నిరూపితమైంది. ‘కేసీఆర్‌లో వేడి తగ్గలేదు. మాటల వాడి తగ్గలేదు’ అని బీఆర్ఎస్ శ్రేణులు ఉప్పొంగిపోతున్నాయి. ఇక ఉద్యమ పిడికిైళ్లె లేస్తామని గులాబీ శ్రేణులు చెప్తున్నాయి. ‘ఐయామ్ ఇన్ ది ఫీల్డ్’ అని ప్రకటించిన కేసీఆర్ పోరాట పటిమకు తెలంగాణ పబ్బతి పడుతున్నది.