రామవరం, జూన్ 3 : ‘ఎవరు అవునన్నా.. కాదన్నా.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర మరువలేనిది. వాక్చాతుర్యంతో హింసకు తావులేకుండా శాంతియుత పద్ధతుల్లో రాష్ర్టాన్ని సాధించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు’ అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ ప్రగతివనంలో సింగరేణి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిదని చెప్పారు. సకల జనుల సమ్మెలో 42 రోజులపాటు పాల్గొని తెలంగాణపై వారికున్న మక్కువను చాటారని గుర్తుచేశారు. అనంతరం ఉత్తమ కార్మికుడిగా ఎన్నికైన గట్టయ్యను సింగరేణి యాజమాన్యంతో కలిసి సన్మానించారు.