Drinking Water | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగర తాగునీటి కోసం కాళేశ్వర జలాలను తరలించేందుకు కేసీఆర్ ప్రభుత్వం కొండపోచమ్మసాగర్ నుంచి నీటిని తీసుకోవాలని గతం లో నిర్ణయించింది. ప్రతిపాదనలు సిద్ధం చేయ గా కేవలం రూ.1006 కోట్లతో పది టీఎంసీల జలాలను 24 కిలోమీటర్ల దూరంలోని శామీర్‌పేట సమీపంలో ఉన్న ఘన్పూర్ వరకు తరలించవచ్చని అంచనాలు రూపొందించింది. అదే 20 టీఎంసీలు తరలించాలంటే రూ.2012 కోట్లు అవుతుంది.
కానీ తాజాగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండు రోజుల కిందట 24 కిలోమీటర్ల దూరంలోని కొండపోచమ్మ సాగర్ కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 50 కిలోమీటర్ల దూ రంలోని మల్లన్నసాగర్ నుంచి ఘన్పూర్ వరకు కాళేశ్వరజలాలను తరలించాలని నిర్ణయించింది. అంటే 26 కిలోమీటర్ల దూరం (దాదాపు రెట్టిం పు) పైప్‌లైన్ పొడగించారు. ఇదే కాదు.. మల్లన్నసాగర్‌కు మార్చడం వల్ల వంద మీటర్లకు పైగా నీటిని మోటర్లతో ఎత్తిపోయాల్సి వస్తుంది.
ఒకవైపు పైప్‌లైన్ పొడవు పెరిగి.. లిఫ్టు భారీగా పెరగడంతో అంచనా వ్యయం రూ.2 వేల కోట్ల నుంచి దాదాపు మూడు రెట్ల వరకు పెరిగినట్టు తెలుస్తున్నది. కొండపోచమ్మసాగర్ నుంచి నీళ్లు తీసుకున్నా, మల్లన్నసాగర్ నుంచి తీసుకున్నా హైదరాబాద్ మహా నగరానికి వచ్చే ప్రయోజనం ఒక్కటే. అలాంటప్పుడు కాస్ట్-బెనిఫిట్ రేషియోను విస్మరించడం వల్ల సర్కారు ఖజానాపై ఏకంగా రూ.4 వేల కోట్ల వరకు భారం పెరుగుతున్నట్టు సమాచారం. మరి ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రతి చిన్న ప్రాజెక్టుకు కాస్ట్-బెనిఫిట్ (బీసీ) రేషియో అంటే పెట్టే ఖర్చు, వచ్చే ప్రతిఫలాన్ని బేరీజు వేసిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు మాత్రం ఆ అంశాన్నే పట్టించుకోకపోవడం వెనక మర్మమేమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ మహా నగరానికి భవిష్యత్తులోనూ మంచినీటి సమస్య తలెత్తకుండా ఉండటంతో పాటు మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తరలించాలని గత కేసీఆర్ ప్రభుత్వమే నిర్ణయించింది. ఈ మేరకు కాళేశ్వరం పథకం రూపకల్పనలోనే ఇందుకు అన్నిరకాల వెసులుబాట్లు కల్పించింది. హైదరాబాద్ నగర తాగునీటి కోసం ఏటా 30 టీఎంసీల కేటాయింపును కాళేశ్వరం డీపీఆర్‌లోనే పొందుపరిచింది. కాగా ఎల్లంపల్లి జలాశయం నుంచి నగరానికి మొదటి దశలో గోదావరిజలాల తరలింపు కొనసాగుతున్నది. ఈ పథకం కింద ఏటా 10 టీఎంసీల జలాలను వాడుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో రెండో దశలో కూడా మరో పది టీఎంసీల గోదావరి జలాలను తరలించి, హైదరాబాద్ మహా నగరవాసులకు అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కూడా తయారు చేసింది. కాళేశ్వరం పథకంలో 15 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీపైనే ఈ జలాలను మేడ్చల్ జిల్లా శామీర్‌పేట సమీపంలోని ఘన్పూర్ వద్దకు తరలించి, శుద్ధి చేసిన నీటిని ప్రజలకు అందించే సాంకేతిక అంశాలన్నీ అందులో ఉన్నా యి. అందుకే కొండపోచమ్మసాగర్ నుంచి సాగునీటి కోసం నిర్మించిన 127 కిలోమీటర్ల సంగారెడ్డి కాల్వ డిజైన్లోనే హైదరాబాద్ తాగునీరు, మూ సీ ప్రక్షాళన కోసం కాళేశ్వర జలాల మళ్లింపునకు ముందుచూపుతో చర్యలు చేపట్టారు.
ఇందుకోసం సంగారెడ్డి కాల్వ గరిష్ఠ వరద ప్రవాహ సామర్థ్యాన్ని అదనంగా 700 క్యూసెక్కులకు పెంచి 4,354 క్యూసెక్కుల నుంచి 5054 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించారు.
అసంబద్ధ వాదనలు వినిపిస్తున్న ప్రభుత్వం…
వ్యాప్కోస్ రూపొందించిన ప్రతిపాదనల మేరకు తాజా నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతుం డగా.. డిజైన్ మార్పునకు రెండు ప్రధాన కారణాలు న్నట్టు రెండు రోజుల కిందట సీఎంవో నుంచి అధికారిక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
ఎక్కడ వెయ్యి కోట్లు? ఎక్కడ ఆరువేల కోట్లు?
కేవలం గ్రావిటీ ద్వారా నగరానికి రెండో దశ గోదావరి జలాల తరలింపు పథకాన్ని రేవంత్ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఇంతకంటే మెరుగైన డిజైన్, తక్కువ వ్యయంతో పథకం రూపకల్పన చేస్తే బాగుండేది. కానీ గ్రావిటీని కాదని ఎత్తిపోతల డిజైన్ ఎంచుకోవడమే కాకుండా పైప్‌లైన్ దూరం పెంచి, అంచనాలూ పెంచింది. పైగా జలమండలిపై అదనంగా కరెంటు ఖర్చును కూడా మోపుతున్నది. 24 కిలోమీటర్ల దూరంలోని కొండపోచమ్మ సాగర్ నుంచి కాకుండా 50 కిలోమీటర్ల దూరంలోని మల్లన్నసాగర్ నుంచి 15 టీఎంసీలు తరలించాలని తొలుత నిర్ణయించి, ఈ మేరకు రూ.5,560 కోట్లతో జీవో కూడా జారీ చేశారు. తాజాగా ఇప్పుడు 20 టీఎంసీల తరలింపు కోసం అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.7,300 కోట్లకు పెంచారు. ఇందుకోసం మల్లన్నసాగర్ నుంచి రెండు వరుసల పైప్‌లైన్ (3 వేల డయా చొప్పున) వేయాలని నిర్ణయించారు. కాగా ఘన్పూర్ నుంచి జంట జలాశయాలకు ఐదు టీఎంసీల తరలింపునకు ఉజ్జాయింపుగా రూ.1300 కోట్ల వరకు ఖర్చవుతుందని, మిగిలిన రూ.ఆరు వేల కోట్లు మల్లన్నసాగర్ నుంచి ఘన్‌పూర్‌కు 20 టీఎంసీల కాళేశ్వర జలాల తరలింపునకు ఖర్చవుతుందని రిటైర్డ్ ఇంజినీర్ తెలిపారు.
ఇంజినీర్ల మల్లగుల్లాలు
మల్లన్న సాగర్ నుంచి ప్రతిపాదన నీటి పారుదల శాఖ ఇంజనీర్లకు తలనొప్పిగా మారినట్లు తెలిసింది. ఈ పథకాన్ని జలమండలి చేపడుతున్నప్పటికీ మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ నీటిపారుదల శాఖ పరిధిలోకి వస్తుంది. కేసీయార్ హయాంలో కొండ పోచమ్మ సాగర్ నుంచి నీటిని తీసుకునేందుకు డిజైన్ రూపొందించగా ఇప్పుడు మల్లన్నసాగర్‌కు మార్చారు. దీంతో మార్పు కారణాలను అందించాలని ప్రభుత్వం సూచించినట్లు తెలిసింది. గతంలో కొండ పోచమ్మను సమర్ధించిన నీటి ఓరుదల శాఖ ఇప్పుడు మల్లన్న సా గర్‌ను సమర్థించాల్సి వస్తుంది. దీనిపై ఇంజనీర్లు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది.
అసంబద్ధ వాదనలు వినిపిస్తున్న ప్రభుత్వం
కొండపోచమ్మసాగర్ సామర్థ్యం 15 టీఎంసీలైతే, మల్లన్నసాగర్ సామర్థ్యం 50 టీఎంసీలు. నిల్వ ఎక్కువగా ఉంటున్నందున మల్లన్నసాగర్‌ను ఎంచుకున్నట్టు ప్రభుత్వం చెప్తున్నది.
వాస్తవానికి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ప్రస్తుతం ఎల్లంపల్లి జలాశయం నుంచి రోజూ తీసుకుంటున్న నీటి పరిమాణం 331 క్యూసెక్కులు. ఏడాదికి పది టీఎంసీలు. ఒకవేళ 20 టీఎంసీల కోసమైతే 662 క్యూసెక్కులు. ఇంత చిన్న పరిమాణంలో నీటిని తీసుకునేందుకు 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న కొండపోచమ్మసాగర్ సరిపోదా?
ప్రభుత్వం చెప్తున్న లాజిక్‌ను ప్రామాణికంగా తీసుకుంటే.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని కొండపోచమ్మ సాగర్‌కు ఒక దశ లిఫ్టు ద్వారా ఎత్తిపోస్తారు. అంటే కొండపోచమ్మసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తీసుకోవడం వల్ల అందులో ఉండే 15 టీఎంసీలతో పాటు దానికి దిగువన ఉన్న మల్లన్నసాగర్‌లోని 50 టీఎంసీల నిల్వ కూడా భరోసాగా ఉంటుంది. కొండపోచమ్మలో నీళ్లు తగ్గుముఖం పట్టగానే మల్లన్నసాగర్ నుంచి లిఫ్టు చేసుకోవచ్చు. దీని ద్వారా హైదరాబాద్‌కు 65 టీఎంసీల నీటి భరోసా ఉంటుంది. కానీ మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీటిని తీసుకోవడం వల్ల కొండపోచమ్మ నుంచి మల్లన్నసాగర్‌కు నీటిని తరలించే వెసులుబాటే లేదు.
2.ఎత్తిపోతల (లిఫ్టు) ఖర్చును దృష్టిలో పెట్టుకొని మల్లన్నసాగర్‌ను ఎంచుకున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
వాస్తవ విరుద్ధంగా ఉన్న ఈ ప్రభుత్వ వాదనపై ఇంజినీరింగ్ నిపుణులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొండపోచమ్మ నుంచి ఘన్‌పూర్‌కు గ్రావిటీపైనే జలాల తరలింపు ఉంటుందని చెప్పిన జలమండలి అధికారులు ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ నుంచి కొంత ఎత్తులో నీటిని లిఫ్టు చేయాల్సి ఉండేదని ఇప్పుడు చెప్తున్నారు. జలమండలి అధికారులు ఇప్పుడు విడుదల చేసిన మ్యాప్ ప్రకారం కొండపోచమ్మ దగ్గర నీటిని తీసుకునే లెవల్ 592 మీటర్లు కాగా… ఘన్పూర్ లెవల్ 595 మీటర్లు. అంటే చిన్నపాటి లిఫ్టుతో జలాలను తరలించవచ్చు. కానీ మల్లన్నసాగర్ వద్ద నీటిని తీసుకునే లెవల్ 519 మీటర్లు. అంటే ఉజ్జాయింపుగానే 76 మీటర్ల వరకు నీటిని లిఫ్టు చేయాలి. మరి తక్కువ లిఫ్టుతో భారమా? ఎక్కువ లిఫ్టుతో భారమా?
ఇప్పటికే జలమండలి వివిధ వనరుల నుంచి నీటిని తరలించేందుకు ఏడాదికి రూ.500 కోట్ల వరకు కరెంటు బిల్లులు చెల్లిస్తున్నది. ఇప్పుడు గోదావరి రెండో దశలో కూడా భారీ లిఫ్టులు పెట్టడం వల్ల జలమండలిపై కరెంటు బిల్లుల భారం మరింత పెరగనున్నది. ఈ క్రమంలో మల్లన్నసాగర్‌ను ఎంచుకోవడం వల్ల అటు అంచనా వ్యయంతో పాటు ఏటా నిర్వహణ భారం కూడా పెరగనుంది.
ఘన్పూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్
20 టీఎంసీల తరలింపు కోసం అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.7,300 కోట్లుగా నిర్ధారించారు. ఇందుకోసం మల్లన్నసాగర్ నుంచి రెండు వరుసల పైప్‌లైన్ (3వేల డయా చొప్పున) వేయాలని నిర్ణయించారు.
ఎక్కడ వెయ్యి కోట్లు… ఎక్కడ ఆరువేల కోట్లు…
సంవత్సరానికి 10 టీఎంసీలు
24 km కేసీఆర్ ప్రభుత్వంలో రూపొందించిన ప్రాజెక్టు డిజైన్