‘వీర్నపల్లి మండల వ్యాప్తంగా కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయిస్త. హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్, సబేరి హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడిన. కంటి సమస్యలు ఉన్నవారికి కండ్లద్దాలు, ఆపరేషన్లు అందేలా చూస్త’ – మే 8న వీర్నపల్లి సభలో కేటీఆర్
వీర్నపల్లి, జూన్ 26 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట ఇచ్చినట్టుగానే మూరుమూల గిరిజన పల్లెలకు ‘కంటి వెలుగు’ అందించబోతున్నారు. ఆయన చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో కేసీఆర్ కంటివెలుగు శిబిరాలు నేటి నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనుండగా.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. శని, ఆదివారాల్లో వీర్నపల్లి క్లస్టర్ పరిధిలోని కంచర్ల, భూక్యాతండా, బాబాయ్ చెరువు తండా, బాబూసింగ్నాయక్ తండా, బంజరు, మద్దిమల్ల, మద్దిమల్ల తండా, ఎర్రగడ్డ తండా, రంగంపేట గ్రామాల ప్రజలకు వీర్నపల్లి రైతు వేదికలో ఏర్పాట్లు చేశారు. సోమ, మంగళవారాల్లో గర్జనపల్లి క్లస్టర్ పరిధిలోని అడవిపదిర, లాల్సింగ్ తండా, జవహర్నాయక్ తండా, సీతారాంనాయక్ తండా, వన్పల్లి, శాంతినగర్ గ్రామాల ప్రజలకు గర్జనపల్లి రైతువేదికలో ఏర్పాట్లు చేశారు. వీటిపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. ఉదయం, సాయంత్రం గ్రామాల్లో డప్పు చాటింపు వేయిస్తున్నారు. ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో వాల్ పోస్టర్లను అతికించారు. ఉపాధిహామీ కూలీల వద్దకు వెళ్లి కరపత్రాలను పంచుతున్నారు. ఉచిత శిబిరాలు ఏర్పాటు చేస్తుండటంతో గ్రామీణులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ఏర్పాట్లు పూర్తి చేసినం
వీర్నపల్లి, గర్జనపల్లి క్లస్టర్ల పరిధిలోని రైతు వేదికలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా కేసీఆర్ కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నం. అందుకు అన్ని ఏర్పాట్లు చేసినం. నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నారు. మండలంలోని 17 గ్రామాల ప్రజలు ఉచిత కంటి పరీక్షలు చేయించుకోవాలి.
-గుజ్జుల రాజిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు