హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ 9 స్థానాల్లో పోటీ చేస్తున్నదని, మిగిలిన 110 స్థానాల్లో బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, రాష్ట్రంలో గత పదేండ్ల నుంచి కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను మరోసారి గెలిపిస్తాయని చెప్పారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో ఎన్నోసార్లు మతఘర్షణలతో అట్టుడికిన హైదరాబాద్ గత పదేండ్ల నుంచి ఎంతో ప్రశాంతంగా ఉన్నదని, సీఎం కేసీఆర్ పాలనలో మతకలహాలు, కర్ఫ్యూలు మచ్చుకైనా లేవని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్‌ను గెలిపిస్తే మళ్లీ మతఘర్షణలు ఖాయమని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక హైదరాబాద్ పాతబస్తీలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు, ఆర్వోబీల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు చాలా మేరకు తగ్గాయని, మిగిలిన ఫ్లైఓవర్లు, ఆర్వోబీల నిర్మాణం కూడా పూర్తయితే ట్రాఫిక్ కష్టాల నుంచి సంపూర్ణ విముక్తి లభిస్తుందని అసద్ వివరించారు.