హైదరాబాద్/మేడ్చల్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): శీతాకాల విడిది కోసం సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకొన్న రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా రాష్ర్టానికి వచ్చిన ముర్ముకు సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి సతరించారు. ఈ స్వాగత కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తోపాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కే తారక రామారావు, హరీశ్‌రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్‌కుమార్, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, బీఆర్ఎస్ లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొని, రాష్ట్రపతి ముర్ముకు ఘనస్వాగతం పలికారు.
ప్రజాప్రతినిధులను పరిచయం చేసిన సీఎం
రాష్ట్రపతి ముర్ము హకీంపేటకు చేరుకున్న తరువాత త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్వాగత వేదికపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను సీఎం కేసీఆర్.. రాష్ట్రపతికి పేరుపేరునా పరిచయం చేశారు. రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, సబితాఇంద్రారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఆత్రం సక్కు, రేఖానాయక్, రాథోడ్ బాపురావు, రేగా కాంతారావు, రవీంద్రకుమార్‌తోపాటు ఎమ్మె ల్సీ వాణీదేవిని మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు అని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా పరిచయం చేశారు.
అన్నీతానైన సీఎం కేసీఆర్
రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు స్వాగతం పలికే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ అన్నీతానై వ్యవహరించారు. హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకోగానే మంత్రులు, ప్రజాప్రతినిధులు వరుసగా వచ్చే ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక హెలికాప్టర్ నుంచి రాష్ట్రపతి దిగగానే ఘనస్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేశా రు. తరువాత అక్కడి నుంచి రాష్ట్రపతికి స్వాగ తం పలికేందుకు ఏర్పాటు చేసిన వేదిక వద్దకు గవర్నర్, సీఎం సహా అందరూ కాలినడకన చేరుకొన్నారు. ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్రపతి విమానం దిగిన స్థలం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్దకు కారులో చేరుకొన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థాని క సంస్థల ప్రజాప్రతినిధులు, బీజేపీ నేతలు సహా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరినీ సీఎం కేసీఆర్ పేరుపేరునా రాష్ట్రపతికి పరిచయం చేశారు. కాగా, సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళిసై, రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో రాష్ట్రపతి శ్రీశైలం వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకొన్నారు.
రాజ్‌భవన్‌లో ఎట్‌హోం
రాజ్‌భవన్‌లో సోమవారం రాత్రి ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఎట్‌హోంకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, హైకోర్టు సీజే ఉజ్జల్ భూయాన్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
నేడు మిధాని వైడ్ ప్లేట్ మిల్లు ప్రారంభం
హైదరాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని)లో రూ. 500 కోట్లతో నెలకొల్పిన వైడ్ ప్లేట్ మిల్లును మంగళవారం రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రారంభించనున్నారు. ఈ వైడ్ ప్లేట్ మిల్లు జాతీయ వ్యూహాత్మక కార్యక్రమాల కోసం ప్రత్యేక స్టీల్ ప్లేట్లను సమకూర్చడంతోపాటు దిగుమతులను తగ్గించేందుకు దోహదపడుతుందని కంపెనీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. రోలింగ్ ఫోర్స్ అధిక సామర్థ్యం కారణంగా ఈ మిల్లు అల్ట్రా-హై స్ట్రెంత్ స్టీల్‌ను చాలా తక్కువ మందంతో రోల్ చేస్తుందని వారు చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ మిల్లును అతి తక్కువ సమయంలోనే ఏర్పాటుచేశామన్నారు. ప్రపంచంలో సూపర్అలాయ్లు, టైటానియం అల్లాయ్‌లు, ప్రత్యేక ఉక్కు మొదలగు వాటిని తయారుచేసే ఆధునిక మెటలర్జికల్ ప్లాంట్లలో మిధాని ఒకటి.