Palla Rajeshwar Reddy | చేర్యాల, జూన్ 11/హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుధవారం బాత్రూంలో జారిపడడంతోఎడమ కాలి తొడ ఎముక ఫ్రాక్చర్ కాగా, కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడ యశోద దవాఖానకు తరలించారు. వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించి, శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. వెంటనే సర్జరీ చేశారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణ ముగిసిన అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా పల్లాకు ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. అలాగే దవాఖానలో అందుతున్న వైద్యం గురించి అడిగారు.
అనంతరం వైద్యులతో మాట్లాడి, పల్లాకు చేసిన శస్త్ర చికిత్స వివరాలను ఆరా తీశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని, రోజువారీ కార్యకలాపాలలో యథాతథంగా నిమగ్నం కావాలని ఆకాంక్షించారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, సంతోష్‌కుమార్, మాలోతు కవిత, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు.
అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పరామర్శించారు. కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభ.. పల్లాను ఫోన్లో పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మాజీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు కూడా దవాఖానకు వెళ్లి పల్లాను పరామర్శించి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.