
స్మృతి భవనంలో అంబేద్కర్ జీవిత విశేషాలను తెలిపే ఫొటోగ్యాలరీ
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
KCR | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ఆధునిక భారతానికి మార్గదర్శకంగా నిలిచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాత్విక చింతనలను తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సైద్ధాంతికంగా అమలు చేసి చూపిస్తున్నది. దళితులపట్ల సమాజంలో నెలకొన్న దృక్పథాన్ని గడిచిన ఎనిమిదిన్నరేండ్లలో కేసీఆర్ సమూలంగా మార్చివేయటమే ఇందుకు నిదర్శనం. అంబేద్కర్ తాత్వికచింతన బాటలో కేసీఆర్ సర్కారు నడుస్తున్నదనడానికి ఇవే కొన్ని ఉదాహరణలు..
అంబేద్కర్ చెప్పింది: ఏది విడిచిపెట్టినా పర్వాలేదు. కానీ, ఉన్నత విద్యను అభ్యసించే హక్కును జారవిడుచుకోవద్దు.
కేసీఆర్ చేసింది: దళిత, గిరిజన, బహుజన, మైనారిటీవర్గాలకు సమాజంలో సమాన గౌరవం దక్కాలంటే ఉన్నతవిద్యతోనే సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్ ముందే గ్రహించారు. ప్రాథమికవిద్యతో ఆపకుండా విదేశాల్లో కూడా దళిత విద్యార్థులు ఉన్నతవిద్యను అభ్యసించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ‘డాక్టర్స్, ఇంజినీర్స్ మేడిన్ తెలంగాణ గురుకులాస్’ అనేలా సకల సౌకర్యాలు కల్పించారు.
అంబేద్కర్ చెప్పింది: అత్యున్నతమైన సాంస్కృతిక జీవన విధానాన్ని కొనసాగిస్తేనే మనిషికి పరిపూర్ణమైన ఆనందం లభిస్తుంది. వారసత్వ కట్టడాలు గత చరిత్రకు సాక్ష్యాలు.
కేసీఆర్ చేసింది: ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర ‘సమ్మక్క-సారలమ్మ’ వేడుకను కేసీఆర్ ప్రభుత్వం ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నది. వందలాది వారసత్వ కట్టడాలకు కొత్త జవసత్వాలు అద్దడాన్ని కేసీఆర్ ఓ దీక్షలా భావించారు. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య, కళా వైభవాల పరిరక్షణకు కృషి చేశారు.
అంబేద్కర్ చెప్పింది: ఓ ప్రాంతం సమ్మిళిత అభివృద్ధికి నోచుకోవాలంటే నదీ జలాల సంరక్షణే అసలైన మార్గం.
కేసీఆర్ చేసింది: ఉమ్మడి రాష్ట్రంలో ఎడారిలా కనిపించిన తెలంగాణ.. ఇప్పుడు పచ్చదనంతో సిరిచేలను తలపిస్తున్నది. అపర భగీరథుడిలా మారి కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో పుడమి తల్లి గొంతుకనే కాకుండా ప్రజల దాహార్తిని కూడా కేసీఆర్ తీర్చారు. ఇప్పుడు దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా మారింది .
అంబేద్కర్ చెప్పింది: వికేంద్రీకరణ ఆవశ్యకతను గుర్తిస్తేనే, దేశాభివృద్ధి సాధ్యం.
కేసీఆర్ చేసింది: పది జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా మార్చడమే కాదు.. కొత్త కలెక్టరేట్లు, పంచాయతీలు, సబ్-రీజినల్ డెవలప్మెంట్ను యుద్ధప్రాతిపదికన చేపట్టి ప్రభుత్వ సేవలను గ్రామగ్రామానికి విస్తృతం చేశారు.
అంబేద్కర్ చెప్పింది: శూద్రులు, వృత్తి పనుల వారు సంపదను అనుభవించాలి.
కేసీఆర్ చేసింది: దళిత బంధు పథకం ద్వారా సంపద సృష్టించే వారికి దాన్ని అనుభవించే హక్కు కూడా ఉండాలంటూ కూలీలను కూడా యజమానులుగా మారుస్తూ వ్యాపార అవకాశాలూ కల్పించారు.