హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో గ్రానైట్ ఇండస్ట్రీని కాపాడేందుకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్లపాటు ఎన్నో సంసరణలు అమలు చేశారని, శ్లాబ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసి ఆ పరిశ్రమలను ఆదుకున్నారని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పార్లమెంట్‌కు వివరించారు. గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ-2025 బిల్లుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం భౌగోళిక రాజకీయాలన్నీ ఖనిజాల చుట్టూ తిరుగుతున్నాయని, మన దేశంలోని గనులను సమర్థంగా వెలికితీయకపోతే ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని సాధించలేమని స్పష్టంచేశారు.
మన దేశంలో మేజర్ మినరల్స్ కంటే మైనర్ మినరల్స్ ఎకువగా ఉన్నాయని, అవి దాదాపు 3 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని తెలిపారు. ‘వన్ నేషన్, వన్ మినరల్, వన్ ట్యాక్స్’ మాడల్‌ను అమలు చేస్తే బాగుంటుందని, పన్ను రేట్లు రెవెన్యూ న్యూట్రల్‌గా ఉండాలని కేంద్రానికి సూచించారు. మేజర్ మినరల్స్‌పై 2శాతంగా ఉన్న డీఎంఈటీని 3శాతానికి పెంచారని గుర్తుచేశారు. తెలంగాణలో మైనర్ మినరల్స్‌పై 2% ఎస్ఎంఈటీ వసూలు చేస్తున్నారని, కానీ ఆ డబ్బును అభివృద్ధి పనులను వినియోగించకుండా బ్యాంకుల్లోనే ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు.
పర్యావరణ అనుమతులు మైనింగ్ లీజ్ పీరియడ్‌తో సమానంగా ఉండాలని, ఒకసారి అనుమతిస్తే లీజు గడువు ముగిసే వరకు అనుమతులు చెల్లుబాటయ్యేలా చూడాలని కేంద్రాన్ని కోరారు. ఐదుగురు అధికారులతో మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసులోనే ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి త్వరితగతిన అనుమతులిచ్చే ఏర్పాటు చేయాలని వద్దిరాజు రవిచంద్ర సూచించారు.