హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. నాడు ఉద్యమ సమయంలో అయినా.. పార్టీ కార్యకర్తలు, ఉద్యమ నాయకులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నివేళలా అండగా నిలుస్తారని మరోసారి నిరూపితమైంది. ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేసేవాళ్లకు ఏ ఆపద వచ్చినా బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపేందుకు ఆదివారం జరిగిన సంఘటనే నిదర్శనం.
బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం టౌన్ మాజీ అధ్యక్షుడు డోకుపర్తి సుబ్బారావు సోషల్ మీడియా వేదిగా ‘కేసీఆర్ సందేశ్’ పేరుతో పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసానికి ఆయనను పిలిపించుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి ధైర్యం చెప్పారు. వైద్య ఖర్చుల కోసం రూ.10 లక్షల చెకు అందజేశారు. ఈ సందర్భంగా ఆపదలో ఆదుకున్న పార్టీ అధినేతకు సుబ్బారావు దంపతులు కృతజ్జతలు తెలిపారు.
తమ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఉపముఖ్యమంత్రులు టీ రాజయ్య, మహమూద్ అలీ పార్టీ అధినేత కేసీఆర్ను ఆదివారం ఎర్రవెల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.