KCR | తెలంగాణ రాష్ట్ర పోలీసులకు గులాబీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమంగా కేసులు పెడుతుండడంపై తీవ్రస్థాయిలో స్పందించారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘ఇవాళ వీళ్లు (కాంగ్రెస్) కేసీఆర్ ఆనవాళ్లు.. కేసీఆర్ ముచ్చట లేకుంట చేస్తం అంటున్నరు. చేయగలుగుతరా? ఇవాళ సభ పెట్టుకుంటే ఎన్ని అడ్డంకులు దానికి.. ప్రైవేటు స్కూల్స్ బస్సులు ఇస్తే.. వాళ్లకు నోటీసులు ఇవ్వడం.. అడుగడుగునా ఆర్టీఏ అధికారులను, పోలీసులను పెట్టి ట్రాఫిక్లను జామ్ చేయడం.. ఇప్పుడు సభకు రావాల్సిన లక్ష, లక్షాయాభైవేల మంది బయటనే ఆగిపోయారు. హన్మకొండ, హుజూరాబాద్, సిద్దిపేట వైపు మూడురోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు ఉన్నయ్. నేను నాయకులను అడిగితే.. రానివ్వడం లేదు ఇబ్బందిపెడుతున్నరు.. లారీలను తీసుకువచ్చి అడ్డం పెడితే ఆగిపోయారని చెప్పారు’ అన్నారు.
‘ నేను అరగంట తర్వాత మాట్లాడుతామంటే.. మనోళ్లు దూరం పోవాలి.. రానోళ్లు ఎట్లైనా అందరు.. మనం మాట్లాడి సభ ముగించాలని చెబితే వేదికపై వచ్చాను. ఇన్ని అడ్డంకులు సృష్టిస్తారా? ఇంత కడుపు ఉబ్బా..? బీఆర్ఎస్ సభలను ఆపుతరా? ఈ ప్రభంజనాన్ని ఎవడు ఆపుతడు ? ఆగబడితే ఆగుతుందా? నేను ఒక్కమాట పోలీసు మిత్రులకు మనవి చేస్తున్నా. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది. ఈ అడిగే హక్కు ఉంటుంది. బీఆర్ఎస్కు సోషల్ మీడియాలో వారియర్స్ ఉన్నారు. వారు బ్రహ్మాండంగా పని చేస్తూ ప్రజల తరఫున అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.. మద్దతుగా నిలబడుతున్నరు. వాళ్లపై కేసులు పెడుతున్నరు. పోలీసులను నేను అడుగుతున్నా.. మీరెందుకు దుముకులాడుతున్నరు? మీకు ఏం అక్కరొచ్చింది?’ అంటూ ప్రశ్నించారు.
‘నేను ఒక్కటే చెబుతున్న మీకు.. ఇవాళ రాత్రి పోయి మీ డైరీల్లో రాసుకోండి ఇవాళ తెలంగాణ చెలరేగిన పరిస్థితికి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. దాన్ని ఎవడూ ఆపలేరు. అది ఎవడి తరం కాదు.. ఎవడి వశం కాదు. మీకు తెల్వదా? పోలీసు ఉద్యోగాలు చేస్తున్న మీరు చదువుకోలేదా? మీకు విజ్ఞానం ఉంది కదా? వీళ్లు దొంగ వాగ్ధానాలు చేయలేదా? ప్రజలను మోసం చేయలేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా? మీరెందుకు కేసులు ఎందుకు పెడుతున్నరు? మీరెందుకు రేపు బలవుతరు? మీకు రాజకీయాలెందుకు? మీ డ్యూటీ మీరు చేసుకోండి. బీఆర్ఎస్ ఎప్పుడూ శాసననాన్ని, చట్టాలను ఉల్లంఘించం. నేను ఒక్క మాట మళ్లీ చెబుతున్నా.. బీఆర్ఎస్ శ్రేణులపై ఎక్కడ అన్యాయంగా కేసులు పెట్టినా.. బీఆర్ఎస్కు లీగల్ సెల్ వీరులున్నరు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. న్యాయస్థానాలు ఉన్నయ్ అక్కడ పోరాటం చేద్దాం. మీకు అండగా కేసీఆర్, బీఆర్ఎస్ ఉంటది. ఇక్కడికేలి నేను కూడా ఊరుకోను. నేను బయలుదేరుతా? యాందాకైనా మంచిదే. ఎవనెవని సంగతేందో.. ఎవడి లెక్కందో అన్నీ లెక్కలు తీద్దాం. ఈ రకంగా మనం ముందుకు వెళ్లాలి’ అని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.