హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చితే హైదరాబాద్ అగ్నిగుండంగా మారుతుందని బీఆర్ఎస్ నాయకుడు పీ కార్త్తీక్‌రెడ్డి హెచ్చరించారు. మూసీ ప్రాజెక్టుపై సంపూర్ణ ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని, నిర్వాసితుల ఆమోదంతోనే సుందరీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మూసీ వెంట బడా సంస్థలు చేపడుతున్న భారీ రియల్ఎస్టేట్ ప్రాజెక్టుల అనుమతులన్నీ రద్దు చేయాలని కోరారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ను వల్లకాడుగా మార్చారని విమర్శించారు. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ఇండ్లను హైడ్రా, మూసీ పేరుతో కూల్చివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. చేతులు తడిపిన వారి జోలికి ప్రభుత్వం వెళ్లడం లేదని, పేద, మధ్యతరగతి ఇండ్లనే కూల్చేస్తున్నారని ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరిట దందా నడుస్తున్నదని ఆరోపించారు. బాధితులకు కేసీఆర్ అండగా ఉంటారని, ప్రజల తరఫున మహాశక్తిలా నిలబడి పోరాడతారని చెప్పారు. ఎవరు బెదిరించినా బీఆర్ఎస్ కార్యాలయానికి ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తామని తెలిపారు. మూసీ బాధితులను కూడగట్టి బడా రియల్ఎస్టేట్ నిర్మాణ సంస్థల ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ప్రాధాన్యాలు నిర్ణయించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారో పాలకులకు అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ హయంలో తెలంగాణ సంతోషంగా, ఆర్థిక పరిపుష్టితో ఉండేదని, ఇప్పుడు అన్ని వ్యవస్థలూ కుప్పకూలాయని మండిపడ్డారు. హైడ్రా పేరిట ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, రైతులను మళ్లీ అడుకునే స్థితికి తీసుకొస్తున్నారని విమర్శించారు. తినడానికి చద్దన్నం లేదు కానీ బిర్యానీ తినిపిస్తా అన్నట్టుగా రేవంత్ వ్యవహారం ఉన్నదని ఎద్దేవా చేశారు.
మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ హయాంలో రూ.16 వేల కోట్లతో డీపీఆర్ తయారైందని, ఇప్పుడు రూ.1.5 లక్షల కోట్ల అంచనా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని కార్తీక్‌రెడ్డి నిలదీశారు. 2,400 కిలోమీటర్లు ఉండే నమామి గంగ ప్రాజెక్టుకే రూ.40 వేల కోట్లు ఖర్చు కాలేదని, 58 కిలోమీటర్లలో ఉన్న మూసీ సుందరీకరణకు లక్షా యాభై వేల కోట్లా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా లక్ష కోట్లు ఖర్చు కాలేదని గుర్తుచేశారు. మూసీ మీద లక్షన్నర కోట్లు ఖర్చు పెడితే తిరిగి రాబడి ఎలా వస్తుందని, నీళ్లే లేని నదిలో రివర్‌ఫ్రంట్ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. మూసీలో సెప్టెంబర్, అక్టోబర్‌లో తప్ప నీళ్లు ఎప్పుడూ ప్రవహించవని చెప్పారు. అసలు మూసీకి గరిష్ఠ ప్రవాహ స్థాయి లెకలున్నాయా? ఉంటే వాటిని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ముందు రివర్బెడ్, మ్యాగ్జిమమ్ ఫ్లడ్లెవల్ (ఎంఎఫ్ఎల్)ను నిర్ణయించాలని సూచించారు. ప్రజలకు మూసీ రివర్‌ఫ్రంట్ మీద ఆసక్తి లేదని పేర్కొన్నారు. రూ.1,500 కోట్లతో మూసీకి డీపీఆర్ తయారుచేస్తారా? అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఎవరికి టెండర్లు ఇవ్వాలో రేవంత్ ప్రభుత్వం ముందే నిర్ణయించుకున్నదని ఆరోపించారు. మూసీ పనులను బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న మెయిన్‌హార్ట్ కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు.
మూసీ కార్పొరేషన్‌కు ముందుగా రూ.50 వేల కోట్లు జమ చేసి నిర్వాసితులకు భరోసా ఇవ్వాలని కార్తీక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవైపు రాష్ట్రం దివాలా తీసిందని, వేతనాలకు కూడా డబ్బులు లేవని చెప్తూ.. మరోవైపు 1.5 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ ఎలా చేపడుతున్నారని నిలదీశారు. హైడ్రాతో అటెన్షన్ డైవర్షన్, మూసీతో ఫండ్ డైవర్షన్ జరుగుతున్నదని ఆరోపించారు. ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రజల పట్ల ప్రేమతో నడిపితే, రేవంత్‌రెడ్డి మాత్రం భయపెట్టి నడుపుతున్నారని దుయ్యబట్టారు. రేవంత్ సరార్ మీద ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు గజ్జెల నగేశ్, చిరుమళ్ల రాకేశ్‌కుమార్, వై సతీష్‌రెడ్డి, బీఆర్ఎస్వీ నేత చటారి దశరథ్ పాల్గొన్నారు.