CM KCR | విశ్వమానవుడిగా పిలుచుకునే.. మహాత్ముడిని కించపరిచే దురదృష్టకర సంఘటనలు ప్రస్తుతం అందరం చూస్తున్నామని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఐసీసీలో జరిగిన స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కొత్త తరం పిల్లలకు, కొత్త తరం రాజకీయ నేతలు చాలా మందికి తెలియదు. ఈనాడున్న భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి చాలా సమయం పట్టింది. ఏ దేశం స్థిరపడాలన్నా.. అనేక రకాల ఒడిదుడుకులు, ఒత్తిళ్లు, దేశానికి సమగ్రత, స్వరూపం రావాలంటే చాలా సమయం తీసుకుంటుంది. దాని వెనుక చాలా ప్రయాస, శ్రమ, అనేక రకాల మేధోమధనాలు, ఆలోచనలు అవన్నీ కలగలిసి ఉంటాయి.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు చాలా విచిత్రమై పరిస్థితి ఉండేది. ఆ సమయంలో సుమారు 584 రాజులు పాలించే సంస్థానాలుండేవి. ఆ సంస్థానాలను మహాత్మాగాంధీ, వారివెంట ఉన్న వల్లాభ్బాయ్పటేల్, జవహర్లాల్ నెహ్రూ తదితర పెద్దలందరు కూడా విశేష కృషిచేసి వారందరినీ ఒప్పించి, ఒక దశలో రాజులకు రాజభరణాలు ఇస్తాం.. మిమ్మల్ని గౌరవిస్తాం.. మీకు రాజ్‌ప్రముఖ్ పేరుతో బిరుదులు ఇస్తాం అని ఒప్పించి.. దేశాన్ని ఒకటిగా చేయడానికి.. ఈ రోజు మన కళ్లముందు కనిపిస్తున్న భారతదేశం, ఇది నా దేశం అని అనుభవిస్తున్న భారతదేశాన్ని అందించేందుకు వారుపడ్డ ప్రయాస, చేసిన కృషి ఎనలేనిది.. అమూల్యమంది. ఈ సందర్భంగా మనందరి తరఫున వారందరికీ వినయపూర్వకమైన జోహార్లు, నమస్సులు అర్పిస్తున్న. ఒక నిర్మాణం జరుగాలంటే, ఒక స్వరూపం ఏర్పడాలంటే చాలా కష్టం, ప్రయాస ఉంటది. 584 సంస్థానాలను స్వాతంత్య్రం వచ్చిన తొలిఘట్టంలోనే మహాత్మా గాంధీ, ఆ నాటి పెద్దల కృషితో విలీనమైనప్పటికీ.. ఇంకా కొన్ని ప్రాంతాలు మిగిలి ఉన్నయ్.
కశ్మీర్ అక్టోబర్ 27న, 1947లో భారతదేశంలో విలీనమైంది. జూనాగఢ్ అనే సంస్థానం 1947, నవంబర్ 9న భారత్‌లో విలీనమైంది. అదేవిధంగా 16 జూన్, 1948లో ఇండోర్ సంస్థానం విలీనం కావడం జరిగింది. సెప్టెంబర్ 17, 1948లో హైదరాబాద్ దేశంగా ఉండి భారతదేశంలో విలీనమైంది. మనం సముజ్వలంగా, సమున్నతంగా నాది అనిచెప్పుకునే భారతదేశంలో మనం 1948లో విలీనమయ్యామని మరోసారి గుర్తు చేస్తున్నాం. ఆ తర్వాత నవంబర్ 1, 1954లో పాండిచ్చేరి దేశంలో విలీనమైంది. ఆ తర్వాత 19 డిసెంబర్ 1961లో గోవా పోర్చుగీస్ నుంచి విడిపోయి ఈనాడున్న భారత్‌లో విలీనమైంది.
చివరగా 1975లో సిక్కీం దేశం భారతదేశంలో విలీనమైంది. 1947 నుంచి 1975 వరకు రకరకాల ప్రక్రియల్లో ఈనాడున్న భారతదేశం ఏర్పడానికి పరిణామాలు దారితీశాయి. దీనివెనుక ఎందరు పెద్దల కృషి, ఎంత కూర్పు, ఎంత సహనం, ఎంత మేధోమథనం, ఎన్ని అంతర్జాతీ, జాతీయ వేదికలపై ప్రయత్నాలు చేస్తే ఈ కూర్పు జరిగిందో ఆలోచన చేయాలి. ఎంత బాధ్యతాయుతమైన పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తే.. కష్టపడే ఈ దేశం వచ్చిందో.. ఇవన్నీ ఆలోచిస్తే.. మనకేం స్పురణకు వస్తుంది.. ఏది ఏమైనా ఈ దేశాన్ని యధావిథిగా బ్రహ్మాండంగా కాపాడుకోవాలి.
సముజ్వలంగా అంతర్జాతీయ విఫణిలో భారత్ భాసిల్లాలనే మాట మన గుండెల్లో కదలాడుతూ ఉంటుంది. వేదికపై ఉన్న మంత్రులు, మండలి, శాసనసభ అధ్యక్షులు, ఉన్నతాధికారులు, సభలో ఉన్న అందరూ ప్రజాప్రతినిధులు ఒక పవిత్ర కర్తవ్యాన్ని తీసుకొని ముందుకుపోతున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని కొంతలో కొంత బాగుచేసుకోగలిగాం. రాష్ట్రం కావాలనే పోరాటం, ఆ తదనంతర కాలంలో ఎనిమిది సంవత్సరాలు ప్రజలు మనకిచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని కొన్ని ప్రాథమిక మౌలిక వసతులు కల్పించుకోగలిగాం. ఇంకా పురోగమించాల్సింది చాలా ఉంది.
ఓ కఠోరమైన వాస్తవాన్ని మనందరం అంగీకరించక తప్పదు. ఇలాంటి సందర్భాల్లో వాటిని సమీక్షించుకోవాలి.. వాటి నుంచి స్ఫూర్తి పొందాలి. ఆ దిశగా ప్రతిజ్ఞబూని కదలాల్సిన అవసరం ఉంటది. పేదరికం ఎంత వరకు దేశంలో ఉంటదో తప్పకుండా ఆక్రందనలు అప్పటి వరకు కొనసాగుతూనే ఉంటయ్.. అలజగడులు కొనసాగుతూ ఉంటాయ్. పేదరికాన్ని నిర్మూలిస్తేనే మన సమాజానికి శాంతి, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం లభిస్తుంది.. దీన్ని అంతా గమనించాలి. ప్రజల ఆపేక్షలు అనుకున్న స్థాయికి చేరలేదు. పేదరికం కొంత కొనసాగుతున్నది. నేడు దళిత సమాజం మాకు జరుగాల్సింది జరుగలేదని ఆక్రోషిస్తూ ఉన్నది. ఇంకా కొన్ని అల్పాదాయవర్గాలు.. ఆదాయం సరిగా లేని అన్నిజాతులు, వర్గాల్లో ఉండే పేదలు మాకు ఇంకా జరుగాల్సి ఉందని తమ బాధను చెబుతున్నారు.
1947లో స్వాతంత్య్రం రాక ముందే మన తెలంగాణ గడ్డపై కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జాగిర్దార్ వ్యతిరేక పోరాటం జరిగింది. అదికొంత చైతన్యం తెచ్చింది.. దాన్ని మనం వ్యతిరేకించలేం. ఆ తర్వాత నక్సలిజం పోరాటాలు వచ్చాయ్. అనేక రకాలుగా అశాంతి ప్రదర్శితమవుతున్నది. వీటిన్నింటిని అధిగమించాలంటే ప్రజారంగంలో ఉన్న మనందరం.. ఇరుకైన సంకుచితమైన భావాలు పక్కనపెట్టి.. విశాల దృక్పథంతో, విశాలమైన ఆలోచనతో స్వార్థాన్ని పక్కనపెట్టి ప్రజాబాహుల్యం కోసం.. ఎవరైతే ఆర్తులు, దీనార్తులు, అన్నార్తులు, అర్హులున్నారో వారందరి సౌభాగ్యం కోసం ఈ వజ్రోత్సవ దీప్తితో మనం కంకణధారులు కావాలని మీ అందరికీ శిరస్సు వచ్చింది ప్రణమిల్లి మనవి చేస్తున్నా.
ప్రతి భారతీయుడు ఈ దేశం నాది ఇందులోనేను వాటాదారున్ని సగర్వంగా తలెత్తుకొని చెప్పే పరిస్థితులు బయట నుంచి వచ్చేవారు చేయరు.. మనమే చేయాలి. బాధితులు, అన్నార్తులు, పేదల బాధలను పొగట్టేందుకు వజ్రోత్సవ దీప్తితో పునరంకితం కావాలి. ఆ దిశగా అందరు ప్రయత్నం చేయాలని కోరుతున్నా. ఈ మధ్యకాలంలో కొన్నిబాధ కలిగించే విషయాలు జరుగుతున్నాయ్. విశ్వమానవుడు అని కీర్తించే.. మహాత్ముడి గురించి కించపరిచే కొన్ని దురదృష్టకర వ్యాఖ్యలు చూస్తున్నాం. నా చిన్ననాటి నుంచి నేటి వరకు అనేక వందలు, వేల సందర్భాల్లో ‘బోలో స్వతంత్ర భారత్‌కీ జై.. మహాత్మా గాంధీకి జై’ అని నినదించిన నాలుక ఇది. కోటానుకోట్ల మంది గాంధీ చిత్రపటాలను నెత్తిన పెట్టుకొని ఊరేగిన దేశమిది. జాతిపితగా మనమే బిరుదాంకితుడిని చేసుకున్న గొప్ప మానవతావాది మహాత్మాగాంధీ. ఆయనను కించపరిచే దురదృష్టకరమైన సంఘటనలు చూస్తున్నాం.
ఇది ఏమాత్రం మంచిది కాదు. ప్రపంచంలో ఏ జాతి తన చరిత్రను తను మలినం చేసుకోదు. అటువంటి వెకిలి మకిలి ప్రయత్నాలు ఎక్కడ వచ్చినా.. మనందరం ఏకోన్ముకంగా, ఏకకంఠంగా ఖండించి.. మహాత్ముడి కీర్తిని విశ్వవాప్తమయ్యేలా ప్రయత్నం చేయాలని ప్రార్థిస్తున్నా. మంచికి ఏనాడూ విలువ తగ్గదు. మహాత్ముడు ఎన్నడూ మహాత్ముడిగానే ఉంటడు. ఎవరో కొందరు చిల్లరమల్లర ఆలోచనలతో చేసే ప్రయత్నాలు ఆనాడూ నెరవేరవు. మహాత్ముడి దేశగానే భారతదేశం ఉంటుంది అని బలంగా నమ్మే వ్యక్తుల్లో నేను ఒకడిని. చౌటుప్పల్ వద్ద ఎవరో మహాత్ముడికి గుడికట్టిచ్చిన సందర్భం చూస్తున్నాం. నేను గాంధేయవాదిని అని చెప్పుకునేందుకు దేశంలో కోటానుకోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో. బయటి దేశాలకు వెళ్తే ‘ఐ ఆమ్ ఇండియా అంటే.. ఓ యువర్ ఫ్రం గాంధీస్ కంట్రీ.. ద గ్రేట్స్మాన్స్ కంట్రీ’ అని చెప్పేటవువంటి భారతదేశం నుంచి గర్వపడుతం.
అలాంటి మహాత్మునికి ఎట్టి పరిస్థితుల్లో మహాత్ముడికి ఎలాంటి కళంకం, ఆపదనలు సహించకుండా ముందుకుపోవాలని నేను మనవి చేస్తున్నా’ అన్నారు. స్వతంత్ర పోరాటంలో అసువులు బాసిన యోధులందరికీ సందర్భంగా జోహార్లు అర్పించారు. ప్రశాంత భారతదేశంలో కొన్ని చిల్లరమల్లర ప్రయత్నాలతో జాతిని చీల్చడానికి జరుగుతున్న కుట్రలను ఐక్యంగా ఖండించాలని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.