CM KCR | దేశాన్ని రక్షించుకునేందుకు ఖమ్మం నుంచి శంఖారావాన్ని పూరించనున్నట్లు బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వాటర్ పాలసీతో రాష్ట్రాలు జట్లు పట్టుకుంటున్నాయని విమర్శించారు. ‘చేబితే ప్రపంచముందు సిగ్గుపోతుంది.
దేశ రాజధాని ఢిల్లీలో మంచినీళ్లు రావు. కరెంటు రాదు. ఉపన్యాసాలు వింటే టీవీలు బద్ధలైతయ్. రైతులు, విద్యార్థులు, యువకులు, విద్యావేత్తలు ఆలోచించాలి. దేశంలో స్థాపిత 4.10లక్షల మెగావాట్ల విద్యుత్ ఉంది. దేశ ఏ ఒక్క రోజు 2.10లక్షల మెగావాట్లకు మించి వాడలేదు. తెలంగాణలో తప్పా భారతదేశంలో ఏయే రాష్ట్రంలో, ప్రధాని సొంత రాష్ట్రం సహా 24 గంటల కరెంటు ఇచ్చే పరిస్థితి లేదు. మంచినీరు ఇవ్వరు.. సాగునీరివ్వరు.. కరెంటు ఇవ్వరు.. ఉద్యోగాలు ఇవ్వరు.. ఉపన్యాసాలు వినాలా? ఎన్ని రోజులు వినాలి?’ అని నిలదీశారు.
దేశంలో ఆలోచనా సరళి మారాలని సీఎం కేసీఆర్ అన్నారు. ‘ఎన్నికల్లో పార్టీలు, నాయకులు గెలుస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. ప్రజల అభిప్రాయం గెలవాలి. ఎన్నికల తదనంతరం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానం తూ.చా.తప్పకుండా నెరవేర్చాలి. లేకపోతే నిలబెట్టి నిలదీసే పరిపూర్ణమైన ప్రజాస్వామ్య ప్రక్రియ రానంత వరకు ఈ దేశంలో ఇవే ఉపన్యాసాలు, సొల్లు పురాణాలు, కాలక్షేపాలు చూస్తాం తప్ప న్యాయం జరుగదు. రాబోయే రోజుల్లో దేశాన్ని రక్షించుకునేందుకు, తెలంగాణ పోరాట పంథా, పౌరుషం ఉన్న గడ్డ కాబట్టి ఇక్కడి నుంచి విజ్ఞాన వీచికలు ప్రసారం కావాలి.
అందులో భాగంగానే చాలామంది ముఖ్యమంత్రులు, పెద్దలు ఖమ్మానికి రాబోతున్నరు. ప్రజలంతా వచ్చిన పాల్గొనాలి. దేశాన్ని రక్షించుకునేందుకు అందరూ నడుం కట్టాలి. మేం బాగున్నం కాదా..? పొరుగింటోళ్లు ఏమైతే ఏంటీ అనుకుంటే.. ఒక రోజు మనకు ఇబ్బంది వస్తుంది. మీ అందరి దీవెనతో తెలంగాణలో రాష్ట్రంలో మౌలిక వసతులు, ప్రజా సంక్షేమం కానీ, కులమత, వర్ణవర్గ రహితంగా కడుపులో పెట్టుకొని ముందుకుపోతున్నమో.. అదే పద్ధతిలో ముందుకు పోదాం.. అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుందాం’ అన్నారు.