హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రజాదరణ పొందిన ‘కేసీఆర్ కిట్’ పథకాన్ని ఏపీలో కూటమి సర్కారు పేరు మార్చి అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి ‘ఎన్టీఆర్ బేబీ కిట్’గా ఆంధ్రప్రదేశ్ సర్కారు నామకరణం చేసింది. పాలనకు మానవీయ కోణం, విధానాలకు సామాజిక దృక్పథం, అట్టడుగు ప్రజల అభివృద్ధికి ఆచరణాత్మక ప్రణాళికలు వెరసి భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన నవజాత శిశువులను అందించడం, సర్కారు దవాఖానలో ప్రసవాల సంఖ్యను పెంచడం, మాతా శిశు మరణాలను తగ్గించడం లక్ష్యంగా నాడు కేసీఆర్ ఈ పథకానికి పురుడు పోశారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రూ.2 వేలవిలువైన 16 వివిధ రకాల వస్తువులను ‘కేసీఆర్ కిట్’ పేరిట అందించారు.
ఈ కిట్ ద్వారా నవజాత శిశువు కోసం దోమతెర, బేబీ ఆయిల్, బేబీ సోప్, బేబీ క్రీమ్, బేబీ షాంపూ, రెండు టవళ్లు, బేబీ న్యాప్కిన్స్, 2 జతల దుస్తులు, సోప్ బాక్స్, ఆట వస్తువులు, తల్లి కోసం రెండు చీరలు, రెండు సబ్బులు, కిట్ బ్యాగ్, ప్లాస్టిక్ బకెట్‌ను అందించారు. అయితే కూటమి సర్కారు అమల్లోకి తెచ్చిన ఎన్టీఆర్ బేబీ కిట్‌లో కేవలం నాలుగు వస్తువులను మాత్రమే ఇస్తున్నది. ఇందులో బేబీ టవ ల్, బేబీ బెడ్, లిక్విడ్ సోప్, దోమతెర మాత్రమే అందిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ. 12 వేలు ఆర్థిక సాయం అందించింది. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కిట్ల పనితీరును దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల ప్రతినిధులు సైతం వచ్చి పరిశీలించారు.
పేదలపై తగ్గిన ఆర్థిక భారం
కేసీఆర్ కిట్ కారణంగా ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీల సంఖ్య పెరిగింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకోవాలంటే జిల్లా కేంద్రాల్లో రూ.50-60 వేలు ఖర్చు అవుతుండగా, హైదరాబాద్‌లో రూ.80వేల నుంచి లక్ష వరకు ఖర్చు అవుతున్నది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించాలని కేసీఆర్ నాడు ఈ బృహత్కార్యానికి అంకురార్పణ చేశారు. మధ్యతరగతి కుటుంబాలు సైతం ప్రభుత్వ దవాఖానల్లో తమ ఆడపిల్లలకు డెలివరీలు చేయించారు.
కేసీఆర్ సంకల్పానికి రేవంత్ సర్కారు తూట్లు
కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించి విజయవంతంగా అమలు చేసిన ఈ పథకాన్ని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మదర్ చైల్డ్ హెల్త్ (ఎంసీహెచ్) కిట్‌గా పేరు మార్చింది. పేరు మార్చిన రేవంత్ సర్కారు పథకం అమలును పూర్తిగా పక్కనబెట్టింది. పేరు మార్పు సరే కానీ కిట్ల సరఫరా ఎప్పుడా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మా త్రం ఇవేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నది. తాజాగా కేసీఆర్ పథకాన్ని రేవంత్ గురువు ఏపీ సీఎం చంద్రబాబు ఏపీలో పేరు మార్చి అమలు చేయడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. పక్క రాష్ర్టాన్ని చూసైనా రేవంత్ సర్కారు బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.