అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలను పోనివ్వని పోలీసులు.. మాజీ సీఎం ఇంటి వద్దకు ఇంతమందిని ఎలా రానిచ్చిండ్రు?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా.. ప్రధాన గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు.. 24 గంటలైనా గడువకముందే గూండాలకు మాత్రం అండగా నిలిచారు. మంగళవారం కేసీఆర్ నివాసంపై దాడి చేసేందుకు వచ్చిన మూకకు పూర్తి భద్రతతో, రోప్‌పార్టీ పెట్టి మరీ.. మాజీ సీఎం ఇంటి సమీపం వరకు ఇలా తీసుకెళ్లారు.
అసెంబ్లీలో గులాబీ దండు దూకుడును ఎదురొనే శక్తిలేక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ సారథి కేసీఆర్‌ను రేవంత్ సర్కార్ టార్గెట్ చేసుకున్నది. ఇన్నాళ్లూ ఆయన చావు కోరిన రేవంత్‌రెడ్డి ఇక నేరుగా అధికారిక దండయాత్రకు తెరలేపారు. కేసీఆర్ ఎర్రవల్లి నివాసం లక్ష్యంగా నలుదిక్కుల నుంచి రౌడీ మూకలను ఉసిగొల్పింది. ఒక్కో దిక్కుకు ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయకత్వంలో పార్టీ కండువా ముసుగులో కిరాయి మూకలు, రౌడీషీటర్లు కత్తులు, కర్రలతో ఎర్రవల్లి మీదకి తెగబడ్డాయి. పక్కా వ్యూహంతోనే ఎర్రవల్లి చుట్టూ 144 సెక్షన్లు విధించి, 1,500 మంది పోలీసులను మోహరించిన రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ నివాసాన్ని ఆధీనంలోకి తీసుకున్నది.

అంతా తమ కంట్రోల్లోనే ఉన్నదని ఇంటెలిజెన్స్ ఉప్పందించిన తరువాత.. ఉత్తరం దిక్కు నుంచి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి.. ఆగ్నేయం నుంచి ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, వేముల వీరేశం.. నైరుతి దిశ నుంచి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్ కార్యకర్తల ముసుగులో రౌడీషీటర్లను ప్రత్యేక వాహనాల్లో ఎర్రవల్లి పొలిమేరల దాకా చొచ్చుకొచ్చారు. నలుదిక్కుల నుంచి సాగిన ప్రయాణంలో ఏ ఒక పోలీసు చెక్‌పోస్టు వీళ్లను ఆపలేదు. ‘కేసీఆర్ చావాలి’ అంటూ వీర్లపల్లి శంకర్, ‘చావు డప్పు కొడ్తా’ అంటూ వేముల వీరేశం ఎర్రవల్లి పొలిమేర దాకా వచ్చినా..! ఏ ఒకరినీ అదుపులోకి తీసుకోలేదు.

ఎర్రవల్లి దారుల్లో రాజ్యాంగం రద్దయినట్టు కాంగ్రెస్ కండువా ముసుగు వేసుకున్న రౌడీలు గుంపుగా వస్తుంటే ఖాకీలు రక్షణ కవచంలా మారారు. రోప్ పార్టీ కంచె రక్షణ నడుమ వారిని ఎర్రవల్లి వైపు నడిపించారు. కానీ ప్రజలు ఆగలేదు. ప్రాణాలకు తెగించారు. ఎర్రవల్లి దారుల్లో బారులు తీరారు. చుట్టుపకల పల్లెలన్నీ ఏకమై ఉద్యమ నేతకు రక్షణ కవచంగా నిలబడ్డాయి. జనం పల్లె పొలిమేరల వద్ద కాపు కాశారు. కర్రలు, పొరకలు, చెప్పులు, రాళ్లు.. ఇలా చేతికి దొరికిన దాంతో వెంటబడి మరీ కిరాయి మూకలను తరిమికొట్టారు. కేసీఆర్ నివాసం దరిదాపుల్లోకి కూడా వెళ్లకుండా తిప్పికొట్టారు. ప్రజల దాడిలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి చావు దెబ్బలు తిన్నట్టు తెలిసింది.
మరోవైపు, తమ అధినేత ఇంటిపై దాడికి సిద్ధపడుతున్నారనే సమాచారంతో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభ పక్ష ఉపనేత హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి హుటాహుటిన ఎర్రవల్లికి బయల్దేరారు. వీరిని మాత్రం పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డగించారు. నగరం దాటకముందే అక్రమంగా నిర్బంధించారు. దాడి వ్యూహంతో ఆయుధాలతో వంద కిలోమీటర్ల నుంచి వచ్చిన హంతక ముఠాలకు రాచబాట వేసిన సరార్.. వారిని మాత్రం రోడ్డుపై ఈడ్చుకెళ్లి స్టేషన్లలో బంధించింది. కేటీఆర్ ఉన్న బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పైకే కాంగ్రెస్ మూకలు దాడికి రావడం, బీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టడం రాష్ట్రంలో శాంతిభద్రతల పతనాన్ని, నడుస్తున్న ఎమర్జెన్సీ పాలనను బట్టబయలు చేసింది.
