KCR : నిర్దిష పరిస్థితులకు నిర్దిష్ట కార్యాచరణ అనే సైద్ధాంతిక నిబద్ధతతో రాష్ట్ర సాధనోద్యమ భావజాల వ్యాప్తి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి (ఆగస్టు 6) సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో జయశంకర్‌తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని ఉద్యమ సంబంధాన్ని స్మరించుకున్నారు గులాబీ బాస్. ఆనాటి ఉద్యమ కాలంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా ప్రజలను ఉద్యమం దిశగా చైతన్యం చేసే దిశగా జయశంకర్ కృష్టి చేశారని కేసీఆర్ తెలిపారు.
రాష్ట్ర సాధనకోసం అనుసరించాల్సిన వ్యూహాలను ఎత్తుగడలను అమలు చేసే దిశగా, తాను ప్రారంభించిన మలి దశ ఉద్యమ పోరాటంలో ప్రొఫెసర్ జయశంకర్ అందించిన స్ఫూర్తి మరువలేనిది అన్నారు. తాను చేపట్టిన ఉద్యమ కార్యాచరణకు అనుగుణమైన దిశగా వారిచ్చిన సలహాలు సూచనలు, ఉద్యమ రథ సారధిగా తనకు కొండంత ధైర్యాన్ని అందించినవని కేసీఆర్ తన కృతజ్ఞతా భావన వ్యక్తం చేశారు. ఉద్యమ కార్యాచరణలో తన వెంట నిలిచి, భుజం తట్టి అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ కన్న కలలను నిజం చేసే దిశగా తన కృషి కొనసాగిందని కేసీఆర్ వెల్లడించారు.
జయశంకర్‌తో కేసీఆర్(ఫైల్ ఫొటో)
రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా పదేండ్ల ప్రగతి పాలనను తన ఆశయాలకు అనుగుణంగా సాగించి, దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపినామని కేసీఆర్ తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను నిజం చేస్తూ, వారి స్ఫూర్తిని కొనసాగించడమే ఆయనకు మనమందించే ఘన నివాళి అని కేసీఆర్ స్పష్టం చేశారు.