హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): పాలకులు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడి గెలవాలనే ప్రజాస్వామిక స్ఫూర్తిని చిట్యాల ఐలమ్మ తెలంగాణ సమాజానికి అందించిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరనారి చిట్యాల (చాకలి) ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా, వారి పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. నాటి రాచరిక పాలనలో, భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థ మీద ఐలమ్మ చేసిన పోరాటం, తెలంగాణ మహిళా చైతన్యానికి బహుజన వర్గాల ప్రజాస్వామిక, ఆత్మగౌరవ పోరాట పటిమకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎక్కడా రాజీ పడకుండా, సబ్బండ వర్గాల అభ్యున్నతి, సంక్షేమమే ప్రధానంగా పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన విధానాలు, పథకాల కొనసాగింపే చాకలి ఐలమ్మకి మనమందించే ఘన నివాళి అని కేసీఆర్ స్పష్టం చేశారు.