హైదరాబాద్, సెప్టెంబర్ 10(నమస్తేతెలంగాణ): తెలంగాణ మహిళా శక్తికి, బహుజనుల ధీరత్వానికి ప్రతీక చిట్యాల ఐలమ్మ అని మాజీ సీఎం కేసీఆర్ అభివర్ణించారు. మంగళవారం ఐలమ్మ వర్థంతి సందర్భంగా కేసీఆర్ ఒక ప్రకటనలో ఆమెను స్మరించుకున్నారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే ఉద్యమిం చి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని పేర్కొన్నారు. ప్రజావ్యతిరేక పాలనపై ధిక్కారాన్ని ప్రకటించిన ఐలమ్మ జీవితం ఆదర్శనీయమన్నారు. ఆమె జయంతి, వర్ధంతిని బీఆర్ఎస్ హయాంలో అధికారికంగా నిర్వహించి గౌరవించిందని గుర్తుచేశారు.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం ఎన్నో ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమని కేటీఆర్ అన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఆమె జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చారన్నారు. పాలకుర్తి మారెట్ యార్డుకు ఐలమ్మ పేరు పెట్టారని పేర్కొన్నారు.