హైదరాబాద్, ఏప్రిల్ 5 ( నమస్తే తెలంగాణ ) : స్వాతంత్య్ర సమరయోధుడిగా, భారత ఉప ప్రధానిగా, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన దార్శనికుడిగా జగ్జీవన్‌రామ్ సేవలు మహోన్నతమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకొని కేసీఆర్ ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆ మహనీయుడి స్ఫూర్తితో సమసమాజం కోసం కృషి చేయడమే మనమందించే నివాళి అని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచే సామాజిక వివక్షను ఎదుర్కొన్న ఆయన వర్ణ, కుల వివక్షకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేశారని శ్లాఘించారు. స్వాతంత్య్ర పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్న జగ్జీవన్‌రామ్.. తదనంతరం స్వయంపాలనలో కేబినెట్ మంత్రిగా కార్మిక శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. వ్యవసాయం, రక్షణ మంత్రిగా దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. వివక్ష రహిత సమాజం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలను గుర్తించిన దేశ ప్రజలు ఆ మహనీయుడి జయంతిని సమతాదివస్గా జరుపుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన చేపట్టిన పోరాటాలు నేటికీ ఆదర్శనీయమని వెల్లడించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): భారత స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జగ్జీవన్‌రామ్ దార్శనికత మనకు ఎంతో స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. బూబూ జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకొని శనివారం ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. సామాజిక న్యాయం, సమానత్వంతో పాటు సాధికారత కోసం జగ్జీవన్‌రామ్ పోరాడారని గుర్తుచేసుకున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రామ్ జయంతిని రస్కరించుకొని మాజీ మంత్రి హరీశ్‌రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం అట్టడుగు వర్గాల తరఫున జగ్జీవన్‌రామ్ అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు.