ఇచ్చోడ, ఫిబ్రవరి 14: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను రైతులు శనివారం ముందస్తుగా నిర్వహించారు. పొలాల్లో కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. బాజాభజంత్రీలు మోగించి పండుగ వాతావరణంలో వేడుకను జరుపుకొన్నారు. ‘కేసీఆర్ సారె రావాలి.. మళ్లీ కారే కావాలి.. యాదిలా యాదికొస్తున్నావే సారూ.. మళ్లా ఎన్నడొస్తావు కేసీఆర్’ అంటూ గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రైతు రాజు కావాలంటే మళ్లీ తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాయని, ప్రతి రంగం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో పల్లెలన్నీ చెత్త కుప్పలయ్యాయని, కాంగ్రెస్ పాలనలో రైతులకు రైతుబంధు రాక మళ్లీ షావుకార్ల దగ్గరికి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. సమయానికి యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు.
మళ్లీ తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ కేసీఆర్, కేటీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. 17వ తేదీ వరకు రోజూ కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మీనాక్షి, మాజీ ఎంపీటీసీ సుభాష్, రైతులు విఠల్, తిరుపతి, ప్రహ్లాద్, దత్త, జ్ఞానేశ్వర్, వెంకటి తదితరులు పాల్గొన్నారు.