హైదరాబాద్, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ): సామాజిక న్యాయం, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా తొలి ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ అసమాన పోరాటం చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రక్షణ, వ్యవసాయ, కార్మిక శాఖల మంత్రిగా కీలక బాధ్యతల్లో కొనసాగిన జగ్జీవన్‌రామ్ స్వాతంత్య్రానంతర స్వయంపాలనలో దేశప్రగతిలో పాలుపంచుకున్న గొప్పవ్యక్తి అని కీర్తించారు.
ఆయన స్ఫూర్తితో బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో దళిత కులాలకు సామాజిక న్యాయం కోసం అనేక పథకాలు అమలుచేశామని గుర్తుచేశారు. ఉప ముఖ్యమంత్రి లాంటి పదవులు ఇచ్చి గౌరవించామని పేర్కొన్నారు. నాటి పాలనలో ఎస్సీ(మాదిగ)లకు పదవులు, ఇతరత్రా అన్నింటా ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. దళితుల సాధికారత కోసం దళితబంధు లాంటి విప్లవాత్మక పథకానికి అంకురార్పణ చేశామని చెప్పారు. దళిత, బహుజన వర్గాలకు ఆర్థిక, రాజకీయాల్లో సామాజిక న్యాయం దక్కినప్పుడే బాబూ జగ్జీవన్‌రామ్‌కు మనం అర్పించే ఘన నివాళి అని పునరుద్ఘాటించారు.