KCR : సిట్ అధికారులు నందినగర్‌లోని తన ఇంటి గోడలకు నోటీసులు అంటించడంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి ఆయన లేఖ రాశారు. చట్టపరమైన అభ్యంతరాలున్నా తాను విచారణలో సిట్‌కు సహకరిస్తానని చెప్పారు. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉంటానని తెలిపారు. గోడలకు నోటీసులు అంటించడం సరైన పద్ధతి కాదని కేసీఆర్ పేర్కొన్నారు. సిట్ పోలీసుల వైఖరి కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని తెలిపారు. పోలీసుల తీరు నా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉందని వెల్లడించారు. ఏసీపీ వెంకటగిరికి తనను విచారించే అధికార పరిధి లేదని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని తెలిపారు.
కేసీఆర్ లేఖలో ఏం రాశారంటే.. ‘సిట్ అధికారులు వ్యవహరించిన తీరు చట్టాలకి వ్యతిరేకం. సుప్రీంకోర్టు తీర్పులను తుంగలో తొక్కిన సిట్ అధికారుల తీరు. సిట్ అధికారులకి నోటీసు ఇచ్చే అధికారమే లేదు. ఇది నా రాజ్యాంగ హక్కులను కాలరాయడమే. మొన్న రెండుసార్లు సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులు చట్టవిరుద్ధం, చట్టాలను అతిక్రమించి ఇచ్చారు. మీరు ఇచ్చిన మొదటి నోటీసుకు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉండటంవల్ల వేరే రోజు విచారణకు తేదీ ఇవ్వాలని చెప్పాను. దాంతోపాటు 65 ఏళ్ల పైబడిన వ్యక్తులను వారు నివసించే చోటనే విచారించాలని చెప్పే సెక్షన్ 160 CrPC నిబంధనలను మీ దృష్టికి తెచ్చాను’ అని పేర్కొన్నారు.
‘తదుపరి నోటీసులన్నీ కూడా ఎర్రవల్లిలోని నా నివాసానికే పంపాలని చెప్పాను. కానీ, ఇది చెప్పిన తర్వాత కూడా గుర్తుతెలియని వ్యక్తులు మీ సంతకంతో ఉన్న లేఖను రాత్రి 9 గంటలకు నందినగర్ నివాసంలోని మా ఇంటి గోడకు అతికించినట్లు తెలుస్తోంది. ఆ లేఖ మీరే పంపినట్లయితే, మీ సూచనల మేరకే అతికించినట్లయితే, ఆ లేఖను తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను. ఇది భారత రాజ్యాంగం, చట్టం, గౌరవ సుప్రీంకోర్టుల పట్ల మీకు ఏమాత్రం గౌరవం లేదు అనే విషయాన్ని సూచిస్తుంది. గతంలో సుప్రీంకోర్టు ‘సతేంద్ర కుమార్ యాంటిల్ వర్సెస్ సీబీఐ’ అనే కేసులో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వాట్సాప్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా నోటీసులు పంపడం చట్టబద్ధమైన పద్ధతి కాదని, చట్టం నిర్దేశించిన రీతిలోనే నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. CRPC 160 నోటీసులను వ్యక్తిగతంగా అందజేయాలి. కానీ మీరు కావాలనే చట్టాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది’ అని కేసీఆర్ తన లేఖలో సూచించారు.
‘భవిష్యత్తు నోటీసులన్నీ ఎర్రవల్లికే పంపాలని చెప్పినప్పటికీ మీరు దాన్ని విస్మరించారు. కాబట్టి మీరు ఇచ్చిన రెండో నోటీసు చట్టబద్ధంగా అందలేదు, అది చెల్లదు. మీరు ఇచ్చిన నోటీసు నా రాజ్యాంగబద్ధ హక్కులను ఉల్లంఘించడమే. నేను మీ పోలీస్ స్టేషన్ పరిధిలోగానీ, పొరుగు పోలీస్ స్టేషన్ పరిధిలోగానీ నివసించడం లేదు. కాబట్టి మీకు నోటీసు ఇచ్చే అధికార పరిధి లేదు. ఈ నోటీసుతో నన్ను కట్టడి చేసే అధికారం లేదు. ఎలక్షన్ అఫిడవిట్లో, అసెంబ్లీ రికార్డులో ఉన్న అడ్రస్ ఆధారంగా ఎర్రవల్లిలో విచారించలేమని మీరు చెప్పడం సరికాదు. నోటీసు ఇచ్చే సమయానికి వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నారు అన్నదే ముఖ్యం. నేను కొన్ని సంవత్సరాలుగా ఎర్రవల్లిలో నివసిస్తున్నాను అన్నది నిర్వివాద అంశం. అక్కడే నా స్టేట్మెంట్ రికార్డ్ చేయవలసిన బాధ్యత మీపై ఉన్నది’ అని పేర్కొన్నారు.
‘హరీష్ రావు అఫిడవిట్ లో సిద్దిపేట అని చిరునామా ఉన్నప్పటికీ హైదరాబాద్‌లో నోటీసు ఇచ్చారు. ఇది మీ ద్వంద్వ ప్రమాణాలను సూచిస్తున్నది. మీరు గోడకు నోటీసు అతికించడం చట్టవిరుద్ధం. మీరు నాకు నోటీసు ఇచ్చే అధికార పరిధి లేదు. చట్టం ప్రకారం నా స్టేట్మెంట్ను ఎర్రవల్లిలోనే రికార్డ్ చేయాలి. అయితే చట్టపరమైన అంశాలు ఎలా ఉన్నప్పటికీ, మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యతాయుతమైన భారత పౌరుడిగా దర్యాప్తుకు సహకరించాలని నిర్ణయించుకున్నాను. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లో అందుబాటులో ఉంటా. మీరు నందినగర్ నివాసంలోనే స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని పట్టుబట్టినందున అక్కడే అందుబాటులో ఉంటా’ అని కేసీఆర్ లేఖ ద్వారా తెలియజేశారు.