హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఎందరో కమ్మ నాయకులకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులుగా అవకాశమిచ్చి, కార్పొరేషన్ పదవులు అప్పగించిన కేసీఆర్.. కమ్మల ఆత్మబంధువుగా నిలిచారని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు కొనియాడారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ తర్వాత అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్.. కమ్మ కులస్థులను ఉద్దేశించి కేటీఆర్ తప్పుగా మాట్లాడినట్టు చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. సీఎం రమేశ్ చిల్లర మా ట లు, పిచ్చి ప్రేలాపనలు నమ్మేందుకు కమ్మ సోదరులెవరూ చెవిలో పువ్వులు పెట్టుకోలేదని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ పాలనలో కమ్మ సామాజికవర్గానికి సముచిత ప్రాధాన్యం ఇచ్చారని, కుల, మత ద్వేషం చూపకుండా అన్ని వర్గాలను అక్కున చేర్చుకున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ చేయనివిధంగా కమ్మ సామాజికవర్గానికి చెందిన ఏడుగురికి ఎమ్మెల్యేలు గా అవకాశమిచ్చారని చెప్పారు. పువ్వాడ అజయ్, తుమ్మల నాగేశ్వర్రావును మంత్రులను చేశారని, ఎన్నికల్లో ఓడిపోయిన తుమ్మలను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చి రాజకీయ పునర్జన్మ ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని పేర్కొన్నారు. నామా నాగేశ్వర్రావుకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ బాధ్యతలతోపాటు కొందరిని కార్పొరేషన్ పదవుల్లో నియమించారని వివరించారు. రేవంత్‌రెడ్డికి కమ్మలపై ప్రేమ ఉంటే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కవిత బెయిల్‌పై ఝుటా మాటలు
ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం కేటీఆర్ బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తానని నాలుగు నెలల క్రితం తనతో చెప్పారంటూ సీఎం రమేశ్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని భాస్కర్‌రావు విమర్శించారు. కవితకు ఎనిమిది నెలల క్రితం బెయిల్ వచ్చిందని, అలాంటప్పుడు నాలుగు నెలల క్రితం బెయిల్ కోసం ఎందుకు కలుస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు త ప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
సూటిగా చెప్పలేకే చిల్లర మాటలు : దినేశ్‌చౌదరి
కేటీఆర్ లెవనెత్తిన అంశాలకు సీఎం రమేశ్ సూటిగా సమాధానం చెప్పలేకే చిల్లర మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత దినేశ్‌చౌదరి మండిపడ్డారు. దొంగలా దొరికిపోయి డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. సీఎం రేవంత్, చంద్రబాబు అండతోనే రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. దమ్ముంటే ఆయనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని, అనుచితంగా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.