వరంగల్, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు అధికారులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా మహాసభ నిర్వహణకు పోలీసులు బీఆర్ఎస్ నుంచి యూజర్ చార్జీలు వసూలు చేశారని తెలిపారు. ఇప్పటివరకు ఏ సభకూ ఇలా జరుగలేదని గుర్తుచేశారు. మహాసభ కోసం 2వేల మంది పోలీసులను కేటాయిస్తామని చెప్పి కనీసం 200 మందిని కూడా ఏర్పాటు చేయలేదన్నారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రజతోత్సవ మహాసభ నిర్వహణ అనుమతికి దరఖాస్తు చేసిన తర్వాత 10 రోజుల వరకు ఇవ్వలేదని, కోర్టు జోక్యంతోనే అనుమతి వచ్చిందని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ మహాసభను ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతంచేశారని తెలిపారు. పోలీసుల వైఫల్యం కారణంగానే ట్రాఫిక్‌జామ్ అయ్యిందని, బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై ఉండి ట్రాఫిక్ క్లియర్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. సాధారణ రోజుల్లోనే సరిగా డ్యూటీలు చేయని ఆర్టీఏ అధికారులు బీఆర్ఎస్ సభకు వచ్చే వాహనాలను అడ్డుకునేందుకు ఆదివారం రోడ్లపైకి వచ్చి వీడియోలు తీశారని తెలిపారు. బీఆర్ఎస్ మహాసభపై కాంగ్రెస్‌లో ఆందోళన పెరిగిందని, అందుకే అకస్మాత్తుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో ఆదివారం జాబ్‌మేళాలు నిర్వహించారని చెప్పారు. సభ నిర్వహణకు భూములు ఇచ్చిన ఎల్కతుర్తి, చింతపల్లి రైతులు, భాగస్వామ్యమైన మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల గుండెల్లో కేసీఆర్‌కు చెరగని ముద్ర ఉందని.. రజతోత్సవ సభ నిరూపించిందని హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ పేర్కొన్నారు.
ఒకే ఒక్కడిగా బయలుదేరిన కేసీఆర్ 14 ఏండ్లు తెలంగాణ అంతటా కలియ తిరిగి సమస్యలను గుర్తించి రాష్ట్ర ఏర్పాటు తర్వాత వాటిని పరిష్కరించారని గుర్తుచేశారు. హనుమకొండ జిల్లాలో సభను నిర్వహించేందుకు సహకరించిన కెప్టెన్ లక్ష్మీకాంతారావు కుటుంబ సభ్యులు, రైతులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. చారిత్రక సభలకు వేదికగా ఉన్న వరంగల్.. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభతో మరోసారి ఈ పరంపరను కొనసాగించిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. సభను విఫలం చేసేందుకు యత్నించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చెప్పపెట్టులాగా తెలంగాణ ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేశారని చెప్పారు. సభలో కేసీఆర్ ప్రసంగం పూర్తయి 5 నిమిషాలు కాక ముం దే మంత్రులు పొంగులేటి, సీతక్క, జూపల్లి సిగ్గులేకుండా ప్రెస్‌మీట్ పెట్టారని విమర్శించారు. రాజకీయ పార్టీ పుట్టిన రోజు జరుపుకుంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ములుగు రోడ్డు వద్ద బస్సుల్లో వెళ్తున్న వారిని ఆర్టీవో అధికారులు ఆపి ఎండలో నిల్చోబెట్టారని, టోల్ గేట్ల వద్ద కావాలని ఆపారని ధ్వజమెత్తారు.