KCR | హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవెల్లి నివాసంలో అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబ సభ్యులు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని అన్నీ తానై కేసీఆర్ ఆదుకుంటున్న విషయం తెలిసిందే. కిష్టయ్య కుమార్తె ప్రియాంక చదువుకు కేసీఆర్ ఆర్థిక సాయం అందిస్తున్నారు.
వైద్యవిద్యలో ఆసక్తి చూపిన ప్రియాంకను ఇప్పటికే కేసీఆర్ ఎంబీబీఎస్ చదివించారు. ఎంబీబీఎస్ పూర్తిచేసుకొని పీజీ కోర్సు చేస్తున్న డాక్టర్ ప్రియాంక చదువుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని కిష్టయ్య భార్యా పిల్లలకు అందించారు. కిష్టయ్య కుమారుడు రాహుల్ వివాహం నిశ్చయమైన విషయం తెలిసి కేసీఆర్ ఎంతో సంతోషించారు. కిష్టయ్య కుటుంబానికి తన సంపూర్ణ సహకారం ఎప్పటికీ కొనసాగుతుందని భరోసా ఇచ్చారు.