హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గా ల విద్యార్థులకు సైనిక శిక్షణ అందించాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రుక్మాపూర్ సైనిక గురకుల పాఠశాల ప్రభ మసక బారుతున్నది. కాంగ్రెస్ పాలనలో స్కూల్ ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్ ప్రభు త్వం 2017-18 విద్యా సంవత్సరంలో కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో గురుకుల సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసింది. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు దాదాపు 560 మంది విద్యార్థులకు ఉచిత విద్య, సైనిక శిక్షణ అందిస్తున్నారు.
డైరెక్టర్ లేకుండానే
షెడ్యూల్ ప్రకారం పాఠశాల నిర్వహణ ప్రిన్సిపల్, సైనిక శిక్షణ కల్నల్ (డైరెక్టర్) ఆధ్వర్యంలో కొనసాగాలి. కానీ ఈ విద్యాసంవత్సరం డైరెక్టర్‌నే నియమించలేదు. గతంలో కల్నల్ రవీందర్‌రెడ్డి, రవికుమార్ ఆధ్వర్యంలో సైనిక్‌స్కూల్ అత్యుత్తమ ఫలితాలు సాధించింది. కాంగ్రెస్ సర్కారు వచ్చాక నిరుడు కల్నల్ కేఎస్ రావును నియమించింది. ఆయన హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించడం, విధులు సక్రమంగా నిర్వర్తించలేదన్న విమర్శలున్నాయి. జూన్‌లో ఆయన రాజీనామాతో ఆ పోస్టును భర్తీ చేయలేదు.
ఎన్డీయే పాఠాలు అంతంత మాత్రమే
ఇక్కడి విద్యార్థులకు సైనిక శిక్షణతోపాటు సీబీఎస్ఈ సిలబస్‌తో ఇంటర్ వరకు విద్యను అందిస్తారు. అలాగే, డిఫెన్స్, నేవీ తదితర పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ ఇస్తారు. అందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. టైం షెడ్యూల్ దృష్టిలో పెట్టుకునే ఎన్డీయే సిబ్బందికి గురుకులంలోని క్వార్టర్స్‌లో వసతి కల్పించాలి. కానీ కాంగ్రెస్ సర్కారు వాటిపి కేటాయించకపోగా సిబ్బంది వేరేచోట ఉంటున్నారు.
పత్తా లేని హెల్త్ సిబ్బంది
ఇటీవల 80 మందికి జ్వరాలు రాగా హెల్త్ సిబ్బంది పత్తాలేరు. బాలుర గురుకులంలో ఓ మహిళా హెల్త్ సూపర్వైజర్ను నియమించినా ఆమె రాత్రి 8 తర్వాత అందుబాటులో ఉండటం లేదు. బాలికలకు మహిళలు, బాలురకు పురుష ఉద్యోగులే ఉండాలి. కానీ ఇక్కడ అలా లేదు.