రాష్ట్రంలో పాడిరంగాన్ని అభివృద్ధి చేసి తద్వారా పాడి రైతులకు మేలు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం విజయ డెయిరీ ఆధ్వర్యంలో ‘మెగా డెయిరీ’ని నిర్మించింది. రూ. 250కోట్ల భారీ పెట్టుబడితో ప్రతిరోజు 8 లక్షల లీటర్ల పాలను ప్రాసెసింగ్ చేసే సామర్థ్యంతో ఈ మెగా డెయిరీని అత్యంత సాంకేతికతతో నిర్మించారు. కానీ ఇప్పుడు ఈ మెగా డెయిరీ లక్ష్యం నీరుగారుతున్నది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని మెగా డెయిరీని క్రమంగా ‘ప్రైవేటు’కు ధారాదత్తం చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలిసింది. పొరుగు రాష్ట్రం ‘పెద్దల’ కంపెనీకి కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఇందులో భాగంగానే ఓ ప్రణాళిక ప్రకారం విజయ డెయిరీని నిర్వీర్యం చేసే పనిలో పడినట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి.
Mega Dairy | హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాడి రైతుల నుంచి ఎక్కువ మొత్తంలో పాలను సేకరించాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. పాల సేకరణ పెరిగితే శుద్ధి చేసేందుకు ఇబ్బంది రావొద్దనే ఉద్దేశంతో మెగా డెయిరీ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో 40 ఎకరాల భారీ విస్తీర్ణంలో రూ.250కోట్ల భారీ పెట్టుబడితో మెగా డెయిరీని నిర్మించింది. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) సహకారంతో అత్యంత అధునాతనంగా, సాంకేతికంగా ఈ డెయిరీని నిర్మించారు. ప్రతి రోజు 8 లక్షల లీటర్ల పాలను శుద్ధి చేయడంతోపాటు 5వేల లీటర్ల ఐస్‌క్రీం తయారీ, లక్ష టెట్రా పాల ప్యాకెట్ల తయారీకి ప్రణాళికలు రూపొందించారు. ఈ డెయిరీని నాటి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ 2023 అక్టోబర్ 5న ప్రారంభించారు. కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా విజయ మెగా డెయిరీని నిర్మిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెగా డెయిరీ నిర్వహణకు ప్రభుత్వం నుంచి కనీస సహకారం కరువైనట్టుగా సంస్థ అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏడాది కిందట ప్రారంభించిన మెగా డెయిరీలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో పాల శుద్ధి ప్రారంభంకాకపోవడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తయినా ఇప్పటికీ మెగా డెయిరీ నిర్వహణపై ఆరా తీయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మెయింటనెన్స్ నిధులివ్వడం లేదని తెలిసింది.
అత్యంత సాంకేతికతతో నిర్మించిన విజయ మెగా డెయిరీపై పొరుగు రాష్ట్రం పెద్దల కన్ను పడినట్టుగా తెలిసింది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువనా అన్నట్టుగా మెగా డెయిరీని సదరు పెద్దలకు రాసిచ్చేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టారు. కుక్కను చంపేముం దు పిచ్చిదని ముద్ర వేస్తే దాన్ని చంప డం తేలిక అనే నానుడిని మెగా డెయిరీకి వర్తింప చేస్తున్నట్టుగా తెలిసింది. మెగా డెయిరీ బాగా పని చేస్తే విజయ డెయిరీ కూడా అభివృద్ధిలోకి వస్తుంది. అప్పు డు మెగా డెయిరీని వారికి రాసివ్వడం కుదరకపోవచ్చు. ఈ నేపథ్యంలో మెగా డెయిరీని నిర్లక్ష్యం చేసి అది పని చేయకుండా కుట్రలు చేస్తున్నట్టుగా తెలిసిం ది. అదే జరిగితే విజయ డెయిరీకి ఉపయోగపడాల్సిన మెగా డెయిరీ భారీ భారమై కూర్చుంటుంది. దీన్ని సాకుగా చూపి నష్టాల్లో ఉందనే సాకుతో తమ వారికి కట్టబెట్టేలా పావులు కదుపుతున్నట్టుగా జోరుగా చర్చ జరుగుతున్నది.