హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): తన పుట్టినరోజు సందర్భంగా 4,910 మంది శిశువులకు కేసీఆర్ కిట్లను అందజేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించారు. సంవత్సర కాలంలో తన నియోజకవర్గం సిరిసిల్లలో జన్మించిన ఈ శిశువులకు కిట్లను ఇవ్వనున్నారు. తెలంగాణ ప్రజల కోసం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేశారని, అందులో తనకు అత్యంత ఇష్టమైన కార్యక్రమం కేసీఆర్ కిట్ అని తెలిపారు. మాత, శిశు మరణాలను భారీగా తగ్గించి.. తల్లికి, శిశువుకు మంచి ఆరోగ్యాన్ని అందించే కేసీఆర్ కిట్‌ను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడంలేదని విమర్శించారు.
‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా ఐదేండ్ల నుంచి అనేక కార్యక్రమాలను చేపట్టామని కేటీఆర్ తెలిపారు. 2020లో కరోనా కుదిపేస్తున్న వేళ తన అనుచరులు, కార్యకర్తలు గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా 108 అంబులెన్స్ వాహనాలను ప్రభుత్వ దవాఖానలకు అందించారని గుర్తుచేశారు. 2021లో 14 మంది దివ్యాంగులకు సహాయం అందించారని చెప్పారు. 2022లో సుమారు 600ల సామ్సంగ్ మొబైల్ ట్యాబ్స్‌ను సిరిసిల్ల జిల్లాలోని విద్యార్థులకు అందించామని, వీటి ద్వారా విద్యార్థులు నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యారని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. 2023లో 116 మంది స్టేట్ హోం (యూసుఫ్ గూడ) విద్యార్థులకు లాప్‌టాప్‌లు అందిచామని చెప్పారు. ఒక చిన్న ఆలోచనగా ప్రారంభమైన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ఐదేండ్లుగా వేలాదిమంది జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒకరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.