Minister Harish Rao | గజ్వేల్, ఏప్రిల్ 21: రాష్ట్రంలో అరవై ఏండ్లలో జరగని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరేండ్లలోనే చేసి చూపించారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. దేశంలో మార్పు కోసం బయలుదేరిన కేసీఆర్‌ను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ.. ‘ఈ నెల 27న పార్టీకి 22 ఏండ్లు నిండుతున్నాయి. దేశంలో, రాష్ట్రంలో చాలా పార్టీలు వస్తయి. పోతయి. కానీ పార్టీ పెట్టి లక్ష్యాన్ని చేరుకొని అధికారంలోకి తెచ్చింది కేసీఆర్. రాష్ట్రంలో నాకు తెలిసి పార్టీని రెండు పర్యాయాలు నిలబెట్టిన వారు ఒకరు కేసీఆర్, మరొకరు ఎన్టీఆర్. ఇద్దరి మధ్యలో 50కి పైగా కొత్త పార్టీలొచ్చాయి. పోయాయి. కానీ, వారికి మాత్రం ప్రజల్లో ఆదరణ తగ్గలేదు’ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్టాన్ని కేసీఆర్ ఎలా సాధించారో అలాగే ఉద్యమ స్ఫూర్తితో పరిపాలన నడిపిస్తున్నరని కొనియాడారు. కాదే కాదనుకున్న మల్లన్నసాగర్ గోదావరి నీల్లు తెచ్చిండు, రానే రాదనుకున్న తెలంగాణను సాధించి తీసుకొచ్చారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటికి బెంగ లేకుండా పోయిందని, పొలాలు ఎండకుండా కాపాడుకుంటున్నామని చెప్పారు. వ్యవసాయాధికారులు గ్రామాల్లోని పెద్ద రైతులను చైతన్యం చేసి ఆయిల్‌పాంను సాగుచేసేలా ప్రోత్సహించాలని సూచించారు.
కేసీఆర్ తెలంగాణను ఆకుపచ్చగా మార్చారని, రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. బీఆర్ఎస్ నినాదం ఒక్కటే.. అదే రైతు నినాదమని స్పష్టంచేశారు. అందుకే కేసీఆర్‌ను పలు రాష్ర్టాల్లోని నాయకులు, రైతు సంఘాల నేతలు ఆహ్వానిస్తున్నారని వివరించారు. మహారాష్ట్ర ప్రజలు, రైతులు సీఎం కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలబడేందుకు బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారని తెలిపారు. గులాబీ పార్టీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు గులాంగిరీ చేస్తదని, ఢిల్లీ పెద్దలకు కాదని స్పష్టంచేశారు. ఢిల్లీ పెద్దలకు కాంగ్రెస్, గుజరాత్ పెద్దలకు బీజేపీ గులాంగిరీ చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. తాము మాత్రం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకే గులాంగిరీ చేస్తామని, ఢిల్లీ పెద్దలకు కాదని స్పష్టంచేశారు. తమకు ప్రజలే బాస్‌లని చెప్పారు. ఢిల్లీ, గుజరాత్ పెద్దలకు ఊడిగం చేసే నాయకత్వం కావాలా? తెలంగాణ ప్రజలకు సలాం కొట్టి గులాంగా పనిచేసే సైనికులు కావాలో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు పెద్దపీట వేశారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హైదరాబాద్ నడిబొడ్డున అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతోపాటు సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టి గౌరవించారని గుర్తుచేశారు. ఇప్పటికే 50 వేల మందికి దళితబంధు అందించామని వివరించారు. అన్నం పెట్టిన చేయి కేసీఆర్‌ది అని, అన్నం పెట్టిన చేయికి సున్నం పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల గురించి ఆలోచించిన, దేశంలో అత్యధికంగా వేతనాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్దేనని చెప్పారు. పొరుగు రాష్ర్టాల్లో టీఏ, డీఏ కొర్రీలు పెడుతూ ఉద్యోగులను ఇబ్బందికి గురిచేస్తున్నారని, తెలంగాణలో ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉన్నదని వివరించారు. ఈహెచ్ఎస్ ద్వారా త్వరలోనే క్యాష్‌లెస్ వైద్యసేవలను అమలుచేస్తామని భరోసా ఇచ్చారు.
కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో అడ్డగోలుగా అబద్ధ్దాలు ప్రచారం చేస్తున్నారని, వాటన్నింటినీ బీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ‘నిజాన్ని మనం చెప్తూనే ఉండాలి. నిజాన్ని ప్రచారంలో పెట్టకపోతే అబద్ధ్దాలు నిజమయ్యే అవకాశాలు ఉంటాయి’ అంటూ అంబేద్కర్ చెప్పిన విషయాన్ని గుర్తుంచుకొని వాటిని తిప్పికొట్టాలని సూచించారు. రాష్ర్టాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి అబద్ధ్దాలకు ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లో ప్రచారం చేయాలని, సోషల్ మీడియా సొంటెకాయలకు ప్రతి కార్యకర్త ధీటైన సమాధానం చెప్పాలని సూచించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేసీఆర్ పథకాలను కాపీ కొట్టి పేరు మార్చుకొని అమలు చేస్తున్నదని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, రైతుబంధు సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.