CM KCR | హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ప్రముఖ మరాఠా కవి అన్నాభావు సాఠే కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చే శారు. అన్నాభావ్సాఠే 103వ జయంతి సందర్భంగా మంగళవారం మహారాష్ట్రలోని వాటేగావ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. మాతంగి సామాజిక వర్గానికి చెందిన మహాకవి అన్నాభావుసాఠే రచించిన గ్రంథాలను దేశంలోని అన్ని భాషల్లోకి అనువదించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. దేశం గర్వించదగ్గ ప్రజాకవి అన్నాభావు సాఠేకు పాలకులు సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అట్టడుగు కులంలో పుట్టి జీవితాన్ని వడబోసిన దళితబిడ్డ, దేశ మూలవాసి అన్నాభావు సాఠేను భారతరత్నతో గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. మహారాష్ట్రలోని ఏక్‌నాథ్‌షిండే ప్రభుత్వం ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ పరంగా తాము కూడా ఇందుకోసం ప్రయత్నం చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రధాని మోదీకి తాను లేఖ రాస్తానని వెల్లడించారు.
సాఠే రచనలు అన్ని భాషల్లో రావాలి
సాఠే రచనలు, సాహిత్యం, అణగారిన వర్గా ల కోసం ఆయన పోరాటం అజరామరం అని సీఎం కేసీఆర్ అన్నారు. కమ్యూనిస్టుగా, అంబేదరిస్టుగా సమసమాజ స్థాపనకోసం జీవితాం తం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అన్నాభావుసాఠే అని కొనియాడారు. అన్నాబావు సాఠేను మహారాష్ట్ర ప్రజలు అమరకవిగా కీర్తిస్తున్నారని చెప్పారు. ‘రచనలు అందరూ చేస్తారు. కానీ, సమాజహితంకోసం, సమాజంలోని పీడితు లు, వంచితుల కోసం, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం రాసేవాళ్లు చాలా అరుదుగా ఉంటా రు. అలాంటివారిలో అగ్రగణ్యుడు అన్నాభావ్సాఠే’ అని శ్లాఘించారు. తాను నమ్మిన సిద్ధాం తం కోసం ఏనాడూ వెనుకడుగు వేయకుండా జీవితాంతం ప్రజలతో ఉన్నారని అన్నారు.
స్వదేశం గుర్తించని మహాకవి
అన్నాబావు సాఠేను రష్యా గుర్తించింది కానీ మనదేశం గుర్తించలేదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘అన్నాబావు సాఠేను రష్యాకు పిలిచి గౌరవించారు. రష్యా లైబ్రరీ ముందు ఆయన విగ్రహాన్ని పెట్టారు. ప్రపంచంలోని సాహిత్యాభిలాషులందరికీ మాక్సిం గోర్కి ఏ స్థాయిలో తెలుసో, మహారాష్ట్రలో సాఠే అంతటి సుపరిచితుడు. గోర్కి రాసిన ‘అమ్మ’ నవల ప్ర పంచంలోని అన్ని భాషల్లోకి అనువాదం కావటం వల్ల గోర్కి మనకు తెలుసు. గోర్కిలాగే సా ఠేకు అంతటి గౌరవం ఉన్నది. అందుకే ఆయనను ‘ఇండియన్ మాక్సింగోర్కి’గా కీర్తిస్తున్నా రు. తన రచనల ద్వారా అణగారిన వర్గాలను చైతన్యపర్చిన సాఠేను భారత పాలకులు గుర్తించకపోవడం, ఆయన సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయకపోవటం శోచనీయం. సాఠే త్యాగాలను ఇప్పటికైనా మహారాష్ట్ర, కేంద్ర ప్ర భుత్వాలు గుర్తించాలి. ఆయన రచనలను అన్ని భారతీయ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లో కి అనువదించే ప్రక్రియను చేపట్టి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాఠే విశ్వజనీన, లోకహిత తత్వాన్ని పరిచయం చేయాలి. మహారా ష్ట్ర సీఎం షిండేను నేను ఒకటే కోరుతున్నా.. సాఠేను గౌరవించుకోవడం అంటే మనల్ని మ నం గౌరవించుకోవడమే. మన దేశాన్ని మనం గౌరవించడమే’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
మాతంగులు దేశ మూలవాసులు
అన్నాభావు సాఠే జన్మించిన మాతంగి సమా జం దేశ మూలవాసులని కేసీఆర్ తెలిపారు. వీరు మాతంగి మహాముని వంశస్థులని చెప్పా రు. మాతంగి వంశ చరిత్రను వివరించారు. మాతంగి సమాజం గొప్పతనాన్ని మహాకవి కాళిదాసు కీర్తించారని గుర్తుచేశారు. సంగీత, సాహిత్యానికి ఆది మూలమైన మాతంగి దేవతగా శ్యామలాదేవిని కొలుస్తూ కాళిదాసు గొప్పగా వర్ణించారని ఉదహరించారు.
మాణిక్య వీణాముపలాలయంతీమదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీంమాతంగ కన్యాం మనసా స్మరామి అనే కాళిదాసు పద్యపాదాలను ఉటంకిస్తూ మాతంగి సమాజ గొప్పతనాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఇంతటి మహోన్నత వ్యక్తుల సేవలను గుర్తించటంలో దేశ పాలకులు విఫలమవుతున్నారని విమర్శించారు. మాతంగి సమాజానికి మహారాష్ట్ర ప్రభుత్వాలు సరైన ఆదరణ, గుర్తింపు ఇవ్వడంలేదని, బీఆర్ఎస్ పార్టీ ఆ వర్గానికి అన్నిస్థాయిల్లో సముచిత స్థానం కల్పిస్తుందని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. బీఆర్ఎస్ అన్నివర్గాల ప్రయోజనాలు కాపాడుతుందని చెప్పారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలు ఇతర అన్ని స్థాయిల్లో మాతంగి సమాజానికి సరైన ప్రాతినిధ్యం దొరకలేదని, ఆ వెలితిని బీఆర్ఎస్ పార్టీ పూడుస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అన్నాభావు సాఠే ప్రతిమను, సాహిత్యాన్ని వారి కు టుంబసభ్యులు కేసీఆర్ అందజేశారు. కార్యక్రమంలో అన్నాభావు సాఠే మనుమడు సచిన్భావు సాఠే, సచిన్సాఠే తల్లి సావిత్రిబాయి సా ఠే, మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జి కే వంశీధర్‌రావు, హరిబావు రాథోడ్, ఖదీర్ మౌలానా, భానుదాస్ మురుటే, ఘన్‌శ్యాం శేల్కర్, భగీరథ్ బాలే, బీజే దేశ్‌ముఖ్, శంకరన్న దోండ్గే, మానిక్ కదం, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్‌సింగ్, యశ్పాల్ బీంగే తదితరులు పాల్గొన్నారు.