హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 420 వాగ్దానాలు, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటూ నిరంతరం పోరాటాలు చేస్తున్న ఆదిలాబాద్ జిల్లాలోని ఆదర్శ గ్రామం ముక్రా-కే గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షితోపాటు ఆ గ్రామస్తులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభినందించారు. కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీతోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని హామీల గురించి, గత రెండేండ్లుగా ప్రశ్నిస్తూ.. నిరంతర పోరాటం చేస్తున్న ఆ గ్రామస్తుల పోరాట ప్రతిమను కేసీఆర్ మెచ్చుకున్నారు. బంజారాహిల్స్ నందినగర్‌లోని నివాసంలో కేసీఆర్‌ను ముక్రా-కే గ్రామ సర్పంచ్ మీనాక్షి సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై రెండేండ్లుగా తాము నిరంతరం చేసిన పోరాటాలకు సంబంధించిన బుక్‌లెట్‌ను కేసీఆర్‌కు అందజేసి, ఆయా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడకుండా వారు చేస్తున్న పోరాటాన్ని కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, ఆ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.