‘దేవుడా!… ఓ మంచి దేవుడా!’
‘అదేంటి స్వామీ పిలవగానే వచ్చేశావు?’
‘నువ్వు ఏ దేవుడి కోసం ప్రార్థించావు?’
‘ఇంకే దేవుడి గురించి ప్రార్థిస్తాం. ఎన్నికల సమయంలో ఓటరు దేవుడి గురించే కదా …’
‘అంతే కదా? ఇది నేను ప్రత్యక్షం అయ్యే సీజన్. ఎందుకు తపస్సు చేస్తున్నావో త్వరగా చెప్పు?’
‘ఎన్నికల్లో అన్ని పక్షాలను కరుణించేది, శిక్షించేది నువ్వే కదా? సర్వేలు, మీడియా వార్తలు, చిలక జోస్యాలు వీటన్నింటికన్నా మిమ్మల్నే నేరుగా అడిగి ఈసారి ఎవరిని ఏ విధంగా కరుణించనున్నావు? ఎవరిని ఎలా శిక్షించనున్నావు అనేది ముందుగానే తెలుసుకోవాలని వచ్చాను. చెప్పండి దేవా?’
‘గడుసు వాడివే. దేవుడికి ఎలాంటి పక్షపాతం ఉండదు. అందరికీ వారు వారు కోరుకున్నది ఇస్తాను’
‘ఓటరు దేవుడు గారు! మీరు ఇలా రాజకీయ నాయకుడిగా డొంక తిరుగుడుగా మాట్లాడకండి. సూటిగా చెప్పండి. అందరి కోరికలు తీరిస్తే అందరు ఎలా గెలుస్తారు. ఎంత మంది పోటీ పడ్డా ఒకరే కదా గెలిచేది?’
‘నువ్వన్నదీ నిజమే… నేను చెప్పిందీ నిజమే. అబద్ధం చెప్పడం లేదు. గతంలోనూ ఎవరు కోరుకున్నది వారికి ఇచ్చా. ఇప్పుడూ అంతే, కోరుకున్నది ఇస్తాను’
‘నేను నమ్మను మీరు అబద్ధం చెబుతున్నారు’
‘తెలంగాణ ఉద్యమం గుర్తుందా? కేసీఆర్ ఏం మాట్లాడినా తెలంగాణ కావాలి అనే అన్నారు. కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ఏమన్నారు?
ఏమో మీరే చెప్పండి?’
‘కేసీఆర్ నిరంతరం తెలంగాణ కావాలి అంటే ఆయనకు తెలంగాణ ఇచ్చాను. కుక్కలు కూడా ఇంటివద్ద ఉండవు అని చెప్పిన హనుమంతరావుకు కలవరించింది ఇచ్చానో లేదో టికెట్ కూడా దక్కని ఆయన ఇంటికి వెళ్లి చూడు.’
‘ఆ .. ?’
‘ఏంటీ ఇంకా నమ్మకం కలగడం లేదా? ఇదేమీ మంత్రం కాదు మాయాకాదు. సైకాలజీ ఎప్పుడో కనిపెట్టిన విషయం. నిరంతరం మనం దేని గురించి మాట్లాడతామో, మన నాలుక మీద ఏది నాట్యం చేస్తుందో అదే మనకు దక్కుతుంది. నీకు ఇంకా అనుమానాలు ఉంటే 2018 ఎన్నికలకు ముందు రోజులు గుర్తు తెచ్చుకో ?’
‘ఏం జరిగింది?’
‘బీజేపీ, కాంగ్రెస్తో పాటు కొన్ని పార్టీలు ఇందిరాపార్క్ …ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేసే హక్కు కోసం నిరంతరం తపించారు. అదే సమయంలో గెలిపిస్తే తెలంగాణను అభివృద్ధి పథం వైపు తీసుకువెళతాను అని కేసీఆర్ జపించారు. 2018లో ధర్నా చౌక్ కోరుకున్న వారికి ధర్నా చౌక్, అభివృద్ధి కోసం విజయాన్ని ఆశించిన వారికి విజయాన్ని ప్రసాదించానా లేదా?’
‘అవును… అయితే ఈసారి అందరి కోరిక ఎలా తీరుస్తావు?’
‘ఎవరి నాలుక మీద ఏం నాట్యం చేస్తే అది ఇస్తాను. హస్తం పార్టీ అధ్యక్షుడు నిరంతరం పిండాలు, బొందలు, తొక్కుతా, తాట తీస్తా అంటూ… పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఆయన చేతికి పిండాలే దక్కుతాయి. గతంలో ఉన్న పార్టీకి పిండం పెట్టి సైకిల్ దిగి చేతిని పట్టుకున్నాడు. చేతిలో పిండం పెట్టక పోతే… నేను మాట తప్పితే అప్పుడు నిలదీయి. మరి నువ్వేం కోరుకుంటున్నావు?’
‘తెలంగాణ ఇలానే సస్యశ్యామలంగా ఉండాలని …’
– మురళి