గజ్వేల్, ఫిబ్రవరి 17 : ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక సంపాదకులు తిగుళ్ల కృష్ణమూర్తి, శ్రీలత దంపతుల కుమారుడు శ్రీకర కపర్దిశర్మ వివాహం గౌరీభట్ల శారదాప్రసాద్, విరజ దంపతుల కూతురు మనస్వినితో ఆదివారం సిద్దిపేటలో అంగరంగ వైభవంగా జరిగింది. వారి కుటుంబం సోమవారం మర్కూక్ మండలం పాములపర్తి సమీపంలో నిర్వహించిన శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, శోభ దంపతులు పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు. సంప్రదాయ పద్ధతిలో పూలు, పండ్లు అందించి పట్టువస్ర్తాలు బహూకరించారు. సోమవారం కేసీఆర్ పుట్టినరోజు కావడంతో, ఈ కార్యక్రమానికి వచ్చిన బ్రాహ్మణోత్తములు, వేద పండితుల అభ్యర్థన మేరకు కేసీఆర్ దంపతులు దండలు, ఉంగరాలు మార్చుకున్నారు. వేదమంత్రాలతో వారికి వేదపండితులు ఆశీర్వచనం అందించారు.
ఈ సందర్భంగా తిగుళ్ల కృష్ణమూర్తి దంపతులు ఇచ్చిన ఆతిథ్యాన్ని కేసీఆర్ దంపతులు స్వీకరించారు. తమ ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైన కేసీఆర్ దంపతులకు తిగుళ్ల కృష్ణమూర్తి దంపతులు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని వృక్షార్చనలో భాగంగా పాములపర్తి సమీపంలో నవ దంపతులు మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌తో కలిసి మొక్కనాటి నీళ్లుపోశారు. కార్యక్రమాల్లో మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి, సీఎం మాజీ సీపీఆర్వో వనం జ్వాలానర్సింహారావు, బుద్ధవనం మాజీ ఓఎస్డీ మల్లేపల్లి లక్ష్మయ్య, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, గజ్వేల్ ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మర్కూక్ కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.