KCR | హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతి, సంప్రదాయాల్లోనే ప్రత్యేకతను చాటుకున్నదని తెలిపారు. తరతరాలుగా మహిళా సామూహిక శక్తికి, ఐక్యతకు దర్పణమైన బతుకమ్మ పండుగ, రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు వేదికగా నిలిచిందని గుర్తుచేశారు.
ఎంగిలి పూలతో ప్రారంభమై సద్దులతో ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ సందర్భంగా పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఆడబిడ్డలు, పిల్లాపాపలతో ప్రత్యేక సందడి నెలకొంటుందని తెలిపారు. బతుకమ్మ పండుగ విశిష్టతను గుర్తించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిందని వివరించారు. మహిళల ప్రత్యేక పండుగగా గుర్తించి బతుకమ్మ సందర్భంగా ప్రత్యేక కానుకలను అందజేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పండుగను ఆటపాటలతో, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని తెలంగాణ ఆడబిడ్డలను కేసీఆర్ కోరారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో ప్రకృతిమాత బతుకమ్మ వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.