దేవరుప్పుల, నవంబర్ 13 : నీరుండీ ఇవ్వలేని సర్కారు తీరును ఎండగడుతూ గత యాసంగిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలంబాట పట్టారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండా శివారు పచ్చర్లబాయి తండాలో రైతు ఆంగోతు సత్తెమ్మ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. ఏడెకరాలు నాటు పెట్టగా అంతా ఒక్క తడి దగ్గర ఎండిపోయిందని కేసీఆర్కు చూపిస్తూ సత్తెమ్మ బోరున ఏడ్చింది. తన కొడుకు పెండ్లి పెట్టుకున్నామని, పెండ్లి పత్రిక కేసీఆర్ చేతిలో పెట్టింది. చలించిన కేసీఆర్ తానున్నానంటూ భరోసా ఇచ్చారు. తాను రూ.5 లక్షలు దయాకర్రావుతో పంపుతానని సత్తెమ్మకు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం.. రూ.5 లక్షల చెక్కును మాజీ మంత్రి ఎర్రబెల్లితో పంపించారు. ఆయన బుధవారం పచ్చర్లబాయి తండాలోని ఆంగోత్ సత్తెమ్మ ఇంటికి వెళ్లి కేసీఆర్ ఇచ్చిన చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తాను నాలుగు రోజుల క్రితం ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఇంటికి వెళ్లగా.. ఆయనే సత్తెమ్మ విషయం గుర్తుచేసి రూ.5 లక్షల చెక్కు రాసిచ్చి, తన పేరు చెప్పి సత్తెమ్మకు అందించాలని ఆమెతో తెలిపారు. ఈ డబ్బులతో చేసిన అప్పులు తీర్చాలని సూచించారు.