హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ రౌస్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో రిమాండ్‌లో ఉన్న కవితను.. జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో అధికారులు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు. దర్యాప్తు కొనసాగుతున్నందున మరో 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. దర్యాప్తు సంస్థ విజ్ఙప్తి మేరకు ఈ నెల 20వ తేదీ వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్టు న్యాయస్థానం ప్రకటించింది. ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఎనిమిదివేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్‌ను దాఖలు చేశారు. చార్జిషీటును పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈ నెల 20వ తేదీన విచారణ చేపడ్తామని కోర్టు వెల్లడించింది.