KCR | హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): అనేక రోజుల తర్వాత తన కూతురును చూడగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కండ్లలో ఆనందభాష్పాలు.. కూతురిని ఆత్మీయంగా అలుముకుని నిండునూరేండ్లు వర్ధిల్లు అని దీవించారు. ‘కవితక్క వచ్చింది.. సార్ మనసు తేలికైంది..’ ఏ నోట విన్నా ఇదే ముచ్చట. ఐదున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్‌ను గురువారం ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. భర్త అనిల్‌రావు, కుమారుడు ఆదిత్యతో కవిత వ్యవసాయ క్షేత్రానికి చేరుకోగానే దిష్టితీసి ఇంట్లోకి ఆహ్వానించారు. మాజీ ఎంపీ సంతోష్‌కుమార్, కల్వకుంట్ల వంశీధర్‌రావు, పార్టీ సీనియర్ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు.
కన్నబిడ్డను చూడగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. అక్రమ నిర్బంధం నుంచి బయటకొచ్చిన బిడ్డను తొలిసారి చూడగానే ఆయన కండ్లలో ఆనందం తొణికిసలాడింది. ఎమ్మెల్సీ కవిత తండ్రి కేసీఆర్ దగ్గరికి చేరి ఆయన పాదాలకు నమస్కరించారు. బిడ్డను కేసీఆర్ ఆప్యాయంగా అక్కున చేర్చుకొని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కవిత మురిపెంగా తన తండ్రి చేతిని ముద్దాడారు. ఆమె యోగక్షేమాలపై కేసీఆర్ ఆరాతీశారు.
మధ్యాహ్న భోజనం తర్వాత సాయత్రం 4.30 గంటలకు కవిత తిరిగి హైదరాబాద్ నగరం లోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. చాలాకాలం తర్వాత తమ పార్టీ అధినేత ఉత్సాహంగా కనిపించారని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత వెంట మాజీమంత్రి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.