హైదరాబాద్, నవంబర్25 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ, కులగణన కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్‌ను ప్రభుత్వం స్వతంత్రంగా పనిచేయనివ్వాలని, కమిషన్‌కు వసతులు కల్పించాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కులగణనపై బీసీ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వాటిని ప్రభుత్వం నివృత్తి చేయాలని కోరారు. 55 ఏండ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, ఇప్పటి వరకు కులగణన ఎందుకు చేపట్టలేదో రాహుల్‌గాంధీ చెప్పాలని నిలదీశారు. కర్నాటకలో చేపట్టిన కులగణన వివరాలను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లు, కులగణనకు సంబంధించిన అంశాలపై సలహాలు, సూచనలు చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన నివేదికను డెడికేటెడ్ కమిషన్‌కు సోమవారం అందజేశారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆమె మాసబ్‌ట్యాంక్‌లోని కమిషన్ కార్యాలయానికి వెళ్లి చైర్మన్ బీ వెంకటేశ్వరరావును కలిసి నివేదిక ప్రతిని అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సమాజంలో అన్ని కులాలు అభివృద్ధి చెందాలని ప్రభుత్వాలు అనేక నిర్ణయాలు తీసుకున్నా జరగాల్సిన న్యాయం జరగలేదన్న ఆవేదన, రాజ్యాంగపరమైన హకులు కల్పించలేదన్న భావన బీసీవర్గాల్లో తీవ్రంగా ఉన్నదని తెలిపారు. ప్రాంతీయ పార్టీల హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందని గుర్తుచేశారు.
కులగణన చేపట్టబోమని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో 2021లో అఫిడవిట్ దాఖలు చేసిందని, బీజేపీ డీఎన్ఏలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీలపై వ్యతిరేక భావాలున్నాయని ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. ఇక బీసీలకు న్యాయం చేస్తామని, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని, ఏటా రూ.20వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో లక్ష కోట్లు ఖర్చు చేస్తామని అనేక హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. కులగణన, రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, అనేక బీసీ సంఘాలు ఉద్యమిస్తే అప్పటికే 11 నెలల తర్వాత హైకోర్టు అక్షింతలు వేశాక డెడికేటెడ్ కమిషన్‌ను కాంగ్రెస్ ఏర్పాటు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్‌ను ఏర్పాటు చేసినా కార్యాలయంలో కూర్చుందామంటే కుర్చీ లేదని, రాద్దామంటే పెన్నూ లేదని, అలాంటి పరిస్థితుల్లో నెల రోజుల్లోనే అంతపెద్ద అంశంపై నివేదికనివ్వాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తే ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు. కేవలం రాజకీయ రిజర్వేషన్లకే పరిమితం కాకుండా బీసీలకు సంబంధించిన అన్ని అంశాలపై ప్రభుత్వానికి సిఫారసులు చేయాలని కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లను నిలదీసి హకులు సాధించుకునే ప్రయత్నం చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పిలుపునిచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఓ వైపు ప్రణాళికశాఖ ద్వారా ఇంటింటి సర్వేను చేయిస్తున్నదని, మరోవైపు బీసీ శాఖ బీసీల వివరాలు సేకరిస్తున్నదని, ఆ సమాచారాన్నే డెడికేటెడ్ కమిషన్ వాడుకోవాలని ప్రభుత్వం చెప్తున్నదని, అయితే బీసీలకు రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు కోర్టులో కేసులు వేస్తే అది చట్టం ముందు సర్వే నివేదిక నిలబడుతుందా? లేదా అన్నది ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. దానిపై బీసీలకు రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ స్టికర్లు వేయని ఇండ్లు 70 శాతం ఉన్నాయని, అత్యధిక జనాభా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో సర్వే పూర్తి కాకుండానే రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం సర్వే పూర్తయిందని ప్రభుత్వం ఎలా చెప్తున్నదని ప్రశ్నించారు. సర్వే వివరాల కంప్యుటరైజేషన్ 7 శాతం కూడా పూర్తి కాలేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ బీసీ నాయకులు వీ ప్రకాశ్, రవీందర్‌సింగ్, జూలూరి గౌరీశంకర్, పల్లె రవికుమార్‌గౌడ్, సుమిత్ర ఆనంద్, రాజీవ్‌సాగర్, మఠం భిక్షపతి , ఉపేంద్రాచారి, కిశోర్‌గౌడ్, శుభప్రద్ పటేల్, రామ్ బాబుయాదవ్, రూప్సింగ్, రవీందర్‌యాదవ్, మహేశ్‌యాదవ్, నారాయణ, నరహరి, నిమ్మల వీరన్న, మారయ్య, ఇంతియాజ్, పావనిగౌడ్, ఓదెళ్ల మాధవ్, గీతగౌడ్, మాధవి, మేఘన, జాగృతి రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి, అర్చన సేనాపతి, వరలక్ష్మి మంచాల, లలిత యాదవ్, ఈగ సంతోష్, నరేంద్ర యాదవ్, శ్రీనివాస్ పుట్టి, యునైటెడ్ ఫులే ఫ్రంట్ నాయకులు గట్టు రామచంద్రం, బొల్ల శివశంకర్, రాజారాంయాదవ్, ఆలకుంట్ల హరి, దత్తాత్రేయ, నరేశ్ ఎమ్మెస్ నరహరి, అంబటి సుధాకర్, కుమారస్వామి, ప్రవీణ్, గోపు సదానందం, నాయిని నరేందర్, మధు, సుంకోజు కృష్ణమాచారి, విజయేందర్, సాగర్, సురేశ్, నిమ్మల వీరన్న, మాడెపు అనిల్, లింగం, జంగయ్య పాల్గొన్నారు.