తిమ్మాపూర్, జూన్10: తమను ఎంతో మంది తొక్కేయాలని చూశారని, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎమ్మెల్యే వరకు ఎదిగామని, ఇలాంటి తొక్కివేత చర్యలు తమ బలమని వారనుకుంటున్నా, అది వారి బలహీనతని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భార్య అనురాధ పేర్కొన్నారు. ఎమ్మెల్యే జన్మదిన వేడుకల సందర్భంగా కరీంనగర్ నగర పరిధిలోని అల్గునూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విందుకు హాజరై కేక్ కట్చేసి వేడుకలు జరుపుకొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి పదవి వచ్చి ఉంటే ఈ వేడుకలు మరింత ఘనంగా జరిగేవని అన్నారు. మంత్రి పదవి రాలేదని ఎవరూ ఆందోళన చెందవద్దని, ఆ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటానని ఎమ్మెల్యే కవ్వంపల్లి తెలిపారు. కాగా, ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలకు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఎమ్మెల్యే అనుచరుడు హుకుం జారీచేసినట్టు తెలిసింది. దీంతో అధికారులందరూ హాజరయ్యారు.